రిలేలో రాష్ట్రానికి ఆరు పతకాలు

10 Feb, 2014 00:25 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రిలే జట్లు అరడజను పతకాలు సాధించాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ స్విమ్మింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి.
 
 ఇందులో కర్ణాటక జట్టు 1300 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. 700 పాయింట్లతో తమిళనాడు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 400 మీ. ఫ్రీస్టయిల్ బాలుర (గ్రూప్-1) విభాగంలో రేవంత్ రెడ్డి, 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో గుణ చక్రవర్తి రజత పతకాలు గెలిచారు. 4x100 మీ. ఫ్రీస్టయిల్ రిలే బాలుర ఈవెంట్‌లో శివ కుమార్, సాగర్‌దీప్, నిశాంత్, చిన నాగేంద్రలతో కూడిన ఏపీ బృందం కాంస్య పతకం గెలుపొందింది. ఇదే విభాగం గ్రూప్-2లో గృహంత్ సాయి, రాఘవ, శివ సాకేత్, అభిషేక్‌లు ఉన్న ఏపీ జట్టు కూడా కాంస్యం నెగ్గింది. 4ఁ50 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో శ్రీభువన్ రెడ్డి, సుశాంత్, రియాన్ చెరియన్, అఖిల్‌ల జట్టు మూడో స్థానంలో నిలిచింది.
 
  400 మీ. ఫ్రీస్టయిల్ బాలికల (గ్రూప్-1) విభాగంలో భవ్య, 200 మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో నివేదిత కాంస్య పతకాలు నెగ్గారు. బాలికల 4x100 మీ. ఫ్రీస్టయిల్ రిలేలో అలేఖ్య, స్పందన, శ్రీవల్లూరి, రత్నవల్లూరిలతో కూడిన ఏపీ జట్టు మూడో స్థానంలో నిలిచింది.

 50 మీ. ఫ్రీస్టయిల్‌లో అతమిక కృష్ణన్ బంగారు పతకం గెలుపొందింది. 4ఁ100 మీ. రిలేలో బబిత, ఆశ, స్మృతి మానే, లక్ష్మీలయ గల రాష్ట్ర జట్టు, 4 x50 మీ. ఫ్రీస్టయిల్ రిలే (గ్రూప్-3)లో సాయి కీర్తి, అనిక సోనిగ్, శ్రేష్ట, నదియా ఇషాన్‌లతో కూడిన ఏపీ బృందం కాంస్య పతకాలు సాధించింది. అమిత గొండి మరో స్వర్ణ పతకం నెగ్గింది. 50 మీ. ఫ్రీస్టయిల్‌లో ఆమె విజేతగా నిలిచింది. బాలికల 100 మీ. ఫ్రీస్టయిల్ (గ్రూప్-4) ఈవెంట్‌లో త్రిన తనూజ, నికిత వరుసగా రజత, కాంస్యాలు చేజిక్కించుకున్నారు.
 

మరిన్ని వార్తలు