మురళీధరన్పై శ్రీలంక ఫిర్యాదు

25 Jul, 2016 16:48 IST|Sakshi
మురళీధరన్పై శ్రీలంక ఫిర్యాదు

కొలంబో: ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వైఖరిపై ఆ దేశ క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా పల్లెకిలా పిచ్ను రూపొందించే క్రమంలో మురళీధరన్ ఓవరాక్షన్ చేయడాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రంగా తప్పుబట్టింది.  ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సలహాదారుగా ఉన్న మురళీధరన్..  శ్రీలంక క్రికెట్ మేనేజ్మెంట్ రూపొందించే పిచ్ల వ్యవహారంలో అనవసరపు జోక్యం చేసుకుంటున్నాడని మండిపడింది.

 

ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్కు శ్రీలంక జట్టు ఫిర్యాదు చేసింది. 'తొలి టెస్టు జరిగే పల్లెకిలె స్టేడియంలో పిచ్ ను తయారు చేస్తున్నప్పుడు అక్కడకు వచ్చిన మురళీధరన్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ స్టేడియం నిర్వహాకులు మురళీని అడ్డుకున్నా వారిని తోసుకుంటూ లోనికి వచ్చాడు. ఈ క్రమంలో శ్రీలంక టీమ్ మేనేజర్ చరితా సేననాయకేతో తీవ్ర వాగ్విదానికి దిగాడు. ఒక జట్టుకు కన్సల్టెంట్గా ఉన్న వ్యక్తి, మరొక జట్టు పిచ్లు రూపొందించేటప్పుడు రావడం నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా మురళీ ప్రవర్తిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. మరొకసారి ఈ తరహా ఘటన జరగదని అనుకుంటున్నాం. మురళీ వైఖరితో చాలా నిరూత్సాహానికి గురయ్యాం'అని శ్రీలంక క్రికెట్ జట్టు అధ్యక్షుడు తిలంగా సుమితపాలా సీఏకు ఫిర్యాదు చేశారు. రేపట్నుంచి ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
 

>
మరిన్ని వార్తలు