ఇక ఇస్మార్ట్‌ క్రికెట్‌ బంతులు

13 Aug, 2019 18:48 IST|Sakshi

సిడ్నీ : సాంకేతికత పుణ్యమా అని క్రికెట్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం నుంచి ప్రస్తుతం డీఆర్‌ఎస్‌ వరకు ఆధునిక క్రికెట్‌ రూపాంతరం చెందుతోంది. టెక్నాలజీ రాకతో అంపైర్ల పని కూడా సులువైంది.  అల్ట్రా ఎడ్జ్‌, హకాయ్‌, హాట్‌స్పాట్‌, స్టంప్‌ మైక్రొఫోన్‌, బాల్‌ ట్రాకింగ్‌ వంటివి క్రికెట్‌లో అతిసాధారణమైనవిగా మారిపోయాయి. తాజాగా క్రికెట్‌లో మరో పెను మార్పుకు కూకాబుర్ర సంస్థ శ్రీకారం చుట్టింది. అన్నీ కుదిరితే త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో ఇస్మార్ట్‌(స్మార్ట్‌) బంతులను చూస్తాం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ బంతులను అన్ని విధాల పరీక్షించామని.. త్వరలో బిగ్‌బాష్‌ లీగ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించి అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉంటాయో అంచనావేస్తామని పేర్కొంది. 

ఇస్మార్ట్‌ బంతులు అంటే?
మామూలు కూకాబుర్రా బంతుల్లాగే ఉంటాయి. కానీ ఆ బంతుల్లో మైక్రో చిప్‌లను అమర్చుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ మైక్రో చిప్‌లతో (స్మార్ట్ బంతి) కూడిన క్రికెట్‌ బంతుల్ని తయారు చేస్తోంది.  ఈ ప్రత్యేకమైన బంతులు వేగం, బౌన్స్ తదితర అంశాలను సాధారణ రాడార్ కన్నా మరింత కచ్చితత్వంతో అందిస్తాయని కూకాబుర్ర ప్రకటించింది. ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్‌ అవుతోంది?. బంతిని ఎక్కడ విసిరితే ఎలా టర్న్‌ అవుతుంది? వంటి వివరాల్ని ఇవ్వనుంది. డీఆర్‌ఎస్‌, క్యాచ్‌ల విషయంలో ఈ స్మార్ట్‌ బంతులు ఎంతగానో ఉపయోగపడతాయి.  

ఈ స్మార్ట్‌ బంతి తయారీ కోసం కూకాబుర్రతో స్పోర్ట్‌కోర్‌ అనే సంస్థ చేతులు కలిపింది. ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మైకెల్‌ కాస్ప్రోవిజ్‌ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్‌ లీగుల్లో ఈ బంతిని పరీక్షించాలని ఆ సంస్థలు కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే మొదట బీబీఎల్‌లో ప్రయోగించనున్నారు.

మరిన్ని వార్తలు