తప్పుడు నాయకుడు

25 Mar, 2018 01:40 IST|Sakshi
అంపైర్లకు వివరణ ఇస్తున్న బెన్‌క్రాఫ్ట్, కెప్టెన్‌ స్మిత్‌

బాల్‌ ట్యాంపరింగ్‌ను అంగీకరించిన స్మిత్‌

వ్యూహంలో భాగంగా చేశామన్న ఆసీస్‌ కెప్టెన్‌

క్షమాపణలు కోరుతున్నానని ప్రకటన

అనూహ్యం... అసాధారణం... ఒక అగ్రశ్రేణి జట్టు కెప్టెన్‌ తాము కావాలనే బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డామని, ఇదంతా వ్యూహంలో భాగంగా తాము తీసుకున్న సమష్టి నిర్ణయమని ప్రకటించడం!  క్రీడాస్ఫూర్తి అనే పదానికి ఎప్పుడూ మైళ్ల దూరంలో ఉండే ఆస్ట్రేలియా మరోసారి తన అథమ స్థాయి తెలివితేటలను బయట పెట్టుకుంది. ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు తప్పుడు పని చేయాలనుకోవడమే నేరం కాగా... ఒక యువ ఆటగాడిని అందుకోసం బలి పెట్టే ప్రయత్నం చేయడం నిజంగా క్షమించరానిది. పైగా తాను బాధ్యత తీసుకుంటున్నానని, అయితే కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకోనంటూ మళ్లీ బుకాయింపు కూడా. సరిగ్గా ఏడాది క్రితం భారత్‌తో టెస్టులో డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి రివ్యూ విషయంలో రచ్చ చేసి ‘తన బుర్ర పని చేయలేదని’ అంగీకరించిన స్మిత్, కోచ్‌ లీమన్‌ మార్గనిర్దేశనంలోనే ఇప్పుడు అలాంటి సీక్వెల్‌ తయారు కావడం క్రికెట్‌ ప్రపంచంలో పెద్ద సంచలనం.   

కేప్‌టౌన్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదాలు కొత్త కాదు. రివర్స్‌ స్వింగ్‌ను రాబట్టేందుకు ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఘటనలు అనేకం. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాము కావాలని చేయలేదనే వివరణ ఇస్తూ ఒక క్షమాపణతో, చిన్నపాటి శిక్షతో వారంతా బయటపడిపోయారు. కానీ తాజా ఘటనకు ఆ పాపాల జాబితాలో అగ్రస్థానం దక్కుతుంది. క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మన్‌వంటి ఆటగాళ్ల ఆత్మలు కూడా సిగ్గుతో తలదించుకునే స్థితి ఇది. ప్రత్యర్థిని అడ్డుకోలేక ఒక కెప్టెన్‌ అంత పచ్చిగా ట్యాంపరింగ్‌ను ఆశ్రయించడం ఊహకు అందనిది.

పైగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడమంటూ తన సహచరుల్లో ఒకరిని పురమాయించాడు. ఇదంతా తమ సామూహిక పాపమేనని స్మిత్‌ ఒప్పుకున్నాడు. ‘మా ఆటగాళ్ల బృందానికి దీని గురించి తెలుసు. లంచ్‌ విరామ సమయంలో మేం దీనిపై మాట్లాడుకున్నాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని తెలుసు. ఇది నేను బాధపడాల్సిన విషయం. నాకు, మా జట్టుకు ఇది చాలా చెడ్డపేరు తీసుకొచ్చే విషయం. ఇక ముందు ఇలా జరగనివ్వను’ అని స్మిత్‌ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించాడు. అతని ప్రతీ మాటలో అపరాధ భావం కనిపించింది. వీడియో ఫుటేజీలో తాము పట్టుబడకపోయినా జరిగిన సంఘటన పట్ల తాను బాధ పడేవాడినని అతను చెప్పాడు.

‘మేమందరం కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమిది. ఇందులో కోచ్‌ల పాత్ర ఏమీ లేదు. కానీ ఇది చాలా తప్పుడు ఆలోచన. నా నాయకత్వంలో ఇలాంటిది మొదటిసారి జరిగింది. ఇది చాలా కీలకమైన మ్యాచ్‌ అని తెలుసు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు బంతి బాగా రివర్స్‌ అయింది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. అందుకే అలాంటి ప్రయత్నం చేశాం. నిజంగా చాలా బాధగా ఉంది. ఇంకెప్పుడూ ఇలాంటిది జరగనివ్వను’ అని స్మిత్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ప్రస్తుతం కెప్టెన్‌గా తన అవసరం ఆసీస్‌ జట్టుకు ఉందని, కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను చేసింది చాలా పెద్ద తప్పని, అయితే మున్ముందు దీని నుంచి తాను నేర్చుకుంటానన్న స్మిత్‌... ఫలితాన్ని అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైనట్లు చెప్పుకొచ్చాడు.  

లంచ్‌ సమయంలో మేం దీనిపై చర్చించాం. ట్యాంపరింగ్‌ చేసేందుకు నాకు అవకాశం కనిపించింది. అయితే నా ప్రయత్నం పని చేయలేదు. బంతి ఆకారంలో మార్పు రాలేదు. దాంతో అంపైర్లు బంతిని మార్చలేదు. నేను బంతిని చేత్తో రుద్దుతున్న దృశ్యాలు మైదానంలో భారీ స్క్రీన్‌పై కనిపించాయి. దాంతో కంగారుపడి ఆ టేపును నా ప్యాంట్‌ లోపల దాచేశాను. పర్యవసానాలను నేను ఎదుర్కోక తప్పదు.
   – బెన్‌క్రాఫ్ట్‌ 

మరిన్ని వార్తలు