ఇంగ్లండ్‌ ఓడింది

26 May, 2019 05:08 IST|Sakshi

ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం

సౌతాంప్టన్‌: కొన్నాళ్లుగా 400 పైగా పరుగులను అలవోకగా చేస్తూ... 350 పైగా లక్ష్యాలను సునాయాసంగా ఛేదిస్తున్న ఇంగ్లండ్‌... సొంతగడ్డపై ప్రపంచ కప్‌ సన్నాహక మ్యాచ్‌లో బోల్తా పడింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఆస్ట్రేలియా చేతిలో 12 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆసీస్‌ స్టీవ్‌ స్మిత్‌ (102 బంతుల్లో 116; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చక్కటి సెంచరీకి తోడు ఓపెనర్‌ వార్నర్‌ (55 బంతుల్లో 43; 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌ పేసర్‌  ప్లంకెట్‌ (4/69) రాణించాడు.  ఛేదనలో ఇంగ్లండ్‌ 49.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రాయ్‌ (32), బెయిర్‌స్టో (12) త్వరగానే ఔటయ్యారు. విన్స్‌ (64; 5 ఫోర్లు), బట్లర్‌ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) జోరుతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. కానీ, పుంజుకొన్న ఆస్ట్రేలియా బౌలర్లు వీరిని వరుసగా పెవిలియన్‌ చేర్చారు. 18 బంతుల్లో 24 పరుగులు అవసరమైన స్థితిలో వోక్స్‌ (40; 3 ఫోర్లు), ప్లంకెట్‌ (19), ఆర్చర్‌ (1) ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ ఓడిపోయింది.

మరిన్ని వార్తలు