కోహ్లికి చేరువలో స్మిత్‌..

19 Aug, 2019 16:48 IST|Sakshi

దుబాయ్‌: యాషెస్‌ సిరీస్‌లో దుమ్మురేపుతున్న ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తన టెస్టు ర్యాంకింగ్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన బ్యాట్స్‌మెన్‌ టెస్టు ర్యాంకింగ్‌లో స్మిత్‌ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను మూడో స్థానానికి నెట్టాడు. యాషెస్‌ తొలి టెస్టులో స్మిత్‌ రెండు భారీ సెంచరీలతో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. ఫలితంగా తన టెస్టు ర్యాంకింగ్‌లో పైకి ఎగబాకాడు. ప్రస్తుతం స్మిత్‌ 913 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 922 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ను కాపాడుకున్నాడు. వీరిద్దర మధ్య తొమ్మిది పాయింట్లు మాత్రమే వ్యత్యాసం​ ఉండటం గమనార్హం.

యాషెస్‌లో  ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉండటంతో స్మిత్‌  టాప్‌ను చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే స్మిత్‌ టాప్‌లో నిలవడం ఖాయం. కాగా, వెస్టిండీస్‌తో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతుండటంతో కోహ్లి రాణించడంపైనే అతని టాప్‌ ర్యాంకు ఆధారపడి వుంటుంది. చివరగా ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న క్రమంలో కోహ్లి 922 రేటింగ్‌ పాయింట్లను ఖాతాలో వేసుకుని టాప్‌కు చేరుకున్నాడు.  ఐసీసీ బ్యాట్స్‌మెన్‌ టెస్టు ర్యాంకింగ్స్‌లో చతేశ్వర పుజారా(881 పాయింట్లు) నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్‌-10లో  భారత్‌ నుంచి కోహ్లి, పుజరాలు మాత్రమే ఉండగా, ఆసీస్‌ తరఫున స్మిత్‌ ఒక్కడే ఉన్నాడు. ఏడాదిపైగా నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌ టాప్‌-10ను కాపాడుకోవడమే కాకుండా టాప్‌-2కు రావడం ఇక్కడ విశేషం. (ఇక్కడ చదవండి: ఇదేనా మీరిచ్చే గౌరవం: ప్రధాని ఆగ్రహం)

మరిన్ని వార్తలు