వరుసగా నాలుగో ఏడాది కూడా..

16 Dec, 2017 11:03 IST|Sakshi

పెర్త్‌:ఆస్ట్రేలియా క్రికెట్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మరో అరుదైన రికార్డను సొంతం చేసుకున్నాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్‌ శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్న స్మిత్‌.. జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో సమయోచిత సెంచరీతో ఆదుకున్నాడు. మరొకవైపు స్మిత్‌ 121 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఉండగా ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగుల్ని తన ఖాతాలో వేసుకన్నాడు. తద్వారా వరుసగా నాలుగో ఏడాది కూడా స్మిత్‌ వెయ్యి టెస్టు పరుగుల్ని సాధించినట్లయ్యింది. 2014-17 నుంచి చూస్తే స్మిత్‌ ప్రతీ ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని నమోదు చేశాడు.

ఇక్కడ వరుస క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సార్లు వెయ్యికి పైగా టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో ఆసీస్‌ మాజీ ఆటగాడు మాథ్య హేడెన్‌(5 వరుస సంవత్సరాలు) ముందు వరుసలో ఉన్నాడు. 2001 నుంచి 2005 వరుస సంవత్సరాల్లో హేడెన్‌ వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించాడు. ఆ తర్వాత స్మిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఆపై బ్రియాన్‌ లారా(వెస్టిండీస్‌), కెవిన్‌ పీటర్సన్‌(ఇంగ్లండ్‌),ట్రెస్కోథిక్‌(ఇంగ్లండ్‌)లు ఉన్నారు. ఈ ముగ్గురూ మూడు వరుస సంవత్సరాల్లో మాత్రమే వెయ్యికిపైగా టెస్టు పరుగుల్ని సాధించారు. కాగా, ఈ ఏడాది వెయ్యి అంతకంటే టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాళ్లలో చతేశ్వర పుజారా(1140) తొలి స్థానంలో ఉండగా, డీన్‌ ఎల్గర్‌(1097) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక విరాట్‌ కోహ్లి(1059) మూడో స్థానంలో, కరుణరత్నే(1031) నాల్గో స్థానంలో ఉన్నారు. ఆపై చండిమాల్‌(1003), స్టీవ్‌ స్మిత్‌(1001)లు ఉన్నారు.

హాఫ్‌ సెంచరీల కంటే సెంచరీలే ఎక్కువ..

ఇక స్మిత్‌ తాజా సెంచరీతో అతను 22వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. అయితే ఇక్కడ హాఫ్‌ సెంచరీల కంటే స్మిత్‌ చేసిన టెస్టు సెంచరీలే ఎక్కువగా ఉండటం విశేషం. స్మిత్‌ తన కెరీర్‌లో 21 హాఫ్‌ సెంచరీలు సాధించగా, 22 సార్లు హాఫ్‌ సెంచరీలను సెంచరీలుగా మలుచుకున్నాడు. యాషెస్‌ మూడో టెస్టులో స్మిత్‌ చేసిన సెంచరీ అతనికి ఫాస్టెస్‌ సెంచరీగా నిలిచింది. ఈ టెస్టులో స్మిత్‌ సెంచరీ సాధించడానికి 138 బంతులు మాత్రమే తీసుకుని, 2015లో పెర్త్‌లో న్యూజిలాండ్‌పై 140  బంతుల్లో చేసిన సెంచరీని సవరించాడు. 92 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు తన ఇన్నింగ్స్‌ కొనసాగించిన స్మిత్‌ సెంచరీ చేశాడు.
 

మరిన్ని వార్తలు