మళ్లీ రాజస్తాన్‌దే విజయం

20 Apr, 2019 19:43 IST|Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్‌ మరోసారి పైచేయి సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ రాజస్తాన్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా మ్యాచ్‌లో అజింక్యా రహానే(12) విఫలమైనప్పటికీ, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(59 నాటౌట్‌; 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)) బాధ్యతాయుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా రియాన్‌ పరాగ్‌(43; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్‌ అవలీలగా విజయం నమోదు చేసింది. ఇక రాజస్తాన్‌ ఆటగాళ్లలో సంజూ శాంసన్‌(35; 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు.

ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-రోహిత్‌ శర్మలు ఆరంభించారు. కాగా, రోహిత్‌ శర్మ(5) నిరాశపరచడంతో ముంబై ఇండియన్స్‌ 11 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై డీకాక్‌తో జత కలిసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే డీకాక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ముంబై స్కోరు 108 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌(34) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

అటు తర్వాత డీకాక్‌-హార్దిక్‌ పాండ్యాల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. డీకాక్‌(65;47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. ఇక పొలార్డ్‌(10), హార్దిక్‌ పాండ్యా(23)లు స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యారు. చివర్లో బెన్‌ కట్టింగ్‌ 9 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ సాయంతో​ 13 పరుగులు చేశాడు.  రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయస్‌ గోపాల్‌ రెండు వికెట్లు సాధించగా, స్టువర్ట్‌ బిన్నీ, ఆర్చర్‌, ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు