స్మిత్‌ చెడుగుడు.. పాక్‌ చిత్తుచిత్తు

5 Nov, 2019 19:34 IST|Sakshi

కాన్‌బెర్రా : కెప్టెన్‌ మారినా.. ప్రదర్శనలో మార్పురాలేదు. స్వదేశంలో శ్రీలంక చేతిలో ఘోర పరాభావం అనంతరం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) భారీ ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సారథిని మార్చి ఆస్ట్రేలియా పర్యటనకు పాక్‌ను జట్టును పంపింది. అయితే ఆసీస్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడంతో మార్పులు పనిచేశాయని పాక్‌ ఫ్యాన్స్‌ సంబరపడిపోయారు. తొలి టీ20కి వరణుడు అడ్డుపడటంతో ఆ మ్యాచ్‌ రద్దయింది. అయితే మంగళవారం జరిగిన రెండో టీ20లో పాక్‌ చేతులెత్తేసింది. ఆతిథ్య ఆసీస్‌ దెబ్బకు విలవిల్లాడింది. ముఖ్యంగా స్టీవ్‌ స్మిత్‌ పాక్‌ బౌలర్లను చెడుగుడాడుకున్నాడు. దీంతో రెండో టీ20లో ఆసీస్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్మిత్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఫఖర్‌ జమన్‌(2), హారిస్‌ సోహైల్‌(6), రిజ్వాన్‌(14), ఆసిఫ్‌ అలీ(4)లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సారథి బాబర్‌ అజమ్‌(50; 38 బంతుల్లో 6 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో ఇఫ్తికర్‌ అహ్మద్‌ (62 నాటౌట్‌, 34 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో పాక్‌ కనీసం గౌరవప్రదమైన స్కోర్‌ సాధించగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో ఆస్టన్‌ ఆగర్‌ రెండు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్‌, రిచర్డ్‌సన్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (80 నాటౌట్‌; 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌) ఆసీస్‌కు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. వార్నర్‌(20), ఫించ్‌(17), బెన్ మెక్‌డెర్మాట్(21)లు భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినప్పటికీ స్మిత్‌కు తోడుగా నిలుచున్నారు. దీంతో ఆసీస్‌ విజయం సలుభతరమైంది. ఇక పాక్‌ బౌలర్లలో ఇర్ఫాన్‌, వసీమ్‌, ఆమిర్‌లో తలో వికెట దక్కించుకున్నారు. ఇక ఈ సిరీస్‌ నిర్ణయాత్మకమైన మూడో టీ20 శుక్రవారం పెర్త్‌ వేదికగా జరగనుంది.

మరిన్ని వార్తలు