ఫేక్‌ రనౌట్‌తో ఎంత పని చేశావ్‌..!

14 Sep, 2019 10:29 IST|Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (145 బంతుల్లో 80; 9 ఫోర్లు, సిక్స్‌) మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడినా ఆస్ట్రేలియా వెనుకబడింది. ఇక్కడి ఓవల్‌ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 69 పరుగుల ఆధిక్యం దక్కింది. పదునైన బంతులతో పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (6/62) వణికించడంతో ఆసీస్‌ పైచేయి సాధించడంలో విఫలమైంది.కాగా, ఈ టెస్టు మ్యాచ్‌లో నాటకీయ పరిణామం ఒకటి  చోటు చేసుకుంది. ఇంగ్లండ్‌ కీపర్‌ బెయిర్‌ స్టో ఒక ఫేక్‌ రనౌట్‌తో వార్తల్లో నిలిచాడు. యాషెస్‌ సిరీస్‌ ఆద్యంతం తన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు విసుగుపుట్టిస్తున్న స్మిత్‌ను భయపెట్టాలనే ఉద్దేశంతో బెయిర్‌ స్టో బంతి తన చేతుల్లోకి వస్తున్నట్లు నటించాడు.స్మిత్‌ రనౌట్‌ ప్రమాదంలో లేకపోయినా, అలా అనుకునేలా చేశాడు బెయిర్‌ స్టో.

దాంతో రనౌట్‌ నుంచి తప్పించుకోవాలనే యత్నంలో స్మిత్‌ డైవ్‌ కొట్టి మరీ క్రీజ్‌లోకి చేరుకున్నాడు. అయితే అసలు బంతిని ఏ ఒక్క ఫీల్డర్‌ అందుకుని బెయిర్‌ స్టోకు ఇవ్వడానికి సిద్ధం కాలేదని విషయం స్మిత్‌కు తర్వాత కానీ తెలియలేదు. దీనిపై రెండో రోజు ఆట అనంతరం ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్మిత్‌ మాట్లాడుతూ.. ‘ నన్ను అవుట్‌ చేసినంత పని చేశాడు బెయిర్‌ స్టో. నా దుస్తుల్ని మురికి చేశాడు.  ఆపై ఏమీ చెప్పలేదు. నన్ను  రనౌట్‌ చేస్తాడని అనుకోలేదు.  నాకు బంతి ఎక్కడకు వెళ్లిందో అనే విషయం కూడా తెలియదు. పరుగు తీయడానికి మాత్రమే సిద్ధమయ్యా.  స్టో చేసింది సరైన పని కాదని మాత్రమే చెప్పగలను’ అని స్మిత్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు