స్మిత్‌ 'సెంచరీ'ల రికార్డు..!

30 Dec, 2017 12:56 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల టెస్టు ర్యాంకింగ్స్‌లో 945 రేటింగ్‌ పాయింట్లతో బ్రాడ్‌మన్‌ తర్వాత స్థానాన్ని ఆక్రమించిన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. తాజాగా మరో ఘనతను సాధించాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఎంసీజేలో జరిగిన నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ శతకం సాధించడం ద‍్వారా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఎంసీజే గ్రౌండ్‌లో జరిగిన వరుస నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా స్మిత్‌ రికార్డు సాధించాడు. ఇక్కడ తొలి స్థానంలో డాన్‌ బ్రాడ్‌మన్‌ ఉండగా, ఆ తరువాత స్థానాన్ని స్మిత్‌ ఆక్రమించాడు.

మరొకవైపు స్మిత్‌ తన టెస్టు కెరీర్‌లో 23వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించిన మూడో ఆటగాడిగా స్మిత్‌ నిలిచాడు. ఇక్కడ బ్రాడ్‌మన్‌(58 ఇన్నింగ్స్‌లు), సునీల్‌ గవాస్కర్‌(109 ఇన్నింగ్స్‌లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా, స్మిత్‌ 110 ఇన్నింగ్స్‌ల్లో 23వ సెంచరీ మార్కును చేరాడు. కాగా, ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది 1305 టెస్టు పరుగులు సాధించి టాప్‌ ప్లేస్‌లో ఉండగా, చతేశ్వర పుజరా 1128 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక్కడ విరాట్‌ కోహ్లి(1059) నాల్గో స్థానంలో ఉన్నాడు.  యాషెస్‌ టెస్టు సిరీస్‌లో ఇప్పటివరకూ జరిగిన నాలుగు టెస్టుల్లో స్మిత్‌ మూడు సెంచరీలు సాధించాడు. ఇది కెప్టెన్‌గా స్మిత్‌కు 15వ సెంచరీ కావడం మరో విశేషం. దాంతో కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా సరసన స్మిత్‌ నిలిచాడు.ఇక్కడ గ్రేమ్‌ స్మిత్‌(దక్షిణాఫ్రికా) 25 సెంచరీలతో ప్రథమ స్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉంచితే ఇరు జట్ల మధ్య జరిగిన నాల్గోటెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చివరిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది.
 

మరిన్ని వార్తలు