ప్రపంచ కప్‌కు స్మిత్‌ అనుమానమే! 

6 Feb, 2019 02:06 IST|Sakshi

గాయం నుంచి కోలుకొని ఆసీస్‌ స్టార్‌

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లపై విధించిన నిషేధం మార్చి 29న ముగుస్తుంది. జట్టులోకి వీరిద్దరి పునరాగమనంపై ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా వారు రావాల్సిన అవసరం గురించి పదే పదే చెబుతున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా వారిద్దరు ఆడతారని అంచనాలు ఉన్నాయి. అయితే స్మిత్‌ విషయంలో ఇది నిజమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చాలా కాలంగా మోచేతి గాయంతో బాధపడుతున్న స్మిత్‌ చికిత్స పొందుతున్నాడు.

అతను కూడా వరల్డ్‌ కప్‌ కోసం తొందరపడకుండా ఎక్కువ సమయం పట్టినా సరే పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆగాలనే ఆలోచనతో ఉన్నాడు. పైగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌పై కూడా నిషేధం ఉండటంతో చాలా కాలంగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు దూరమైన స్మిత్‌ నేరుగా వరల్డ్‌ కప్‌ ఆడటం కష్టమే. అదే సమయంలో అతను ఇంగ్లండ్‌ కౌంటీల్లో గానీ, ఆసీస్‌ ‘ఎ’ తరఫున గానీ ఆడాలని భావిస్తున్నాడు. మరో వైపు వార్నర్‌ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. మోచేతి గాయంనుంచి కోలుకున్న అతను యూఏఈలో పాక్‌తో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చివరి రెండు మ్యాచ్‌లు నిషేధం ముగిసిన తేదీ తర్వాత జరుగుతాయి కాబట్టి వార్నర్‌కు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ దక్కవచ్చు.    

మరిన్ని వార్తలు