ఫించ్‌ సెంచరీ చేస్తే.. స్మిత్‌ ఓడించాడు!

25 Jan, 2020 13:58 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు తరఫున ఆడే క్రమంలో అరోన్‌ ఫించ్‌లు, స్టీవ్‌ స్మిత్‌లు జట్టుకు విజయాలు సాధించి పెట్టిన సందర్భాలు ఎన్నో. అయితే ఇద్దరూ ప్రత్యర్థులుగా మారితే.. ఒకర్ని ఒకరు ఓడించుకుంటే అది అత్యంత ఆసక్తిగా ఉంటుంది. బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా శనివారం సిడ్నీ సిక్సర్స్‌- మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెనిగేడ్స్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఉంటే, సిడ్నీ సిక్సర్స్‌ సభ్యుడిగా ఉన్న స్మిత్‌ ఉన్నాడు. అయితే తొలుత బ్యాటింగ్‌ చేసిన రెనిగేడ్స్‌ జట్టులో ఫించ్‌ శతకంతో చెలరేగిపోయాడు. 68 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు సాధించాడు. కాగా, మిగతా వారు పెద్దగా రాణించకపోవడంతో రెనిగేడ్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 

ఆ లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్‌ సునాయాసంగా ఛేదించింది. 18.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి సిడ్నీ సిక్సర్స్‌ విజయం సాధించింది. ఈ విజయంలో స్టీవ్‌ స్మిత్‌ కీలక పాత్ర పోషించాడు. కడవరకూ అజేయంగా క్రీజ్‌లో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 66 పరుగులు సాధించాడు. సిడ్నీ సిక్సర్స్‌ ఓపెనర్‌ జోష్‌ ఫిలిఫ్‌ 61 పరుగులు సాధించగా, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన స్మిత్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. బౌండరీలతో అలరిస్తూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. 


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు