ఆసీస్ దూకుడు

25 Mar, 2017 11:47 IST|Sakshi
ఆసీస్ దూకుడు

ధర్మశాల: భారత్ తో జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టులో ఆస్ట్రేలియా దూకుడును కొనసాగిస్తోంది.  తొలి రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 131 పరుగులు చేసిన ఆసీస్ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాల్గో బంతికి ఓపెనర్ రెన్ షా(1)ను ఉమేశ్ యాదవ్ బౌల్డ్ చేశాడు. ఆ తరువాత డేవిడ్  వార్నర్ కు జత కలిసిన కెప్టెన్ స్మిత్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా స్మిత్ మాత్రం తన జోరును కొనసాగించాడు. 67 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించి తన ఫామ్ ను మరోసారి చాటుకున్నాడు. ఆ తరువాత కాసేపటికి డేవిడ్ వార్నర్ కూడా అర్ధ శతకం చేశాడు. 72 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే వీరు 100 కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.

మరొకవైపు తద్వారా ఈ సీజన్ లో భారత్ గడ్డపై తొలి పది ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది.  తొలి పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ చేసిన స్కోరు 52. ఇదే భారత్ గడ్డపై ఈ సీజన్ తొలి పది ఓవర్ల అత్యధిక స్కోరు. అంతకుముందు రాంచీలో జరిగిన టెస్టులో ఆసీస్ మొదటి పది ఓవర్లలో నమోదు చేసిన స్కోరు 50 కాగా దాన్ని ఈ టెస్టు మ్యాచ్లో ఆసీస్ అధిగమించింది.

మరిన్ని వార్తలు