‘మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ అతనే’

12 Sep, 2019 11:27 IST|Sakshi

సిడ్నీ: గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది నిషేధానికి గురైన ఆసీస్‌  ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్‌, సీఏ డైరెక్టర్‌ మార్క్‌ టేలర్‌ మద్దతుగా నిలిచాడు. మళ్లీ స్మిత్‌ ఆసీస్‌ సారథిగా ఎంపిక అవుతాడని టేలర్‌ పేర్కొన్నాడు. 2018లో బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌లకు నిషేధం విధించినప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులో టేలర్‌ సభ్యడిగా ఉన్నాడు. కాగా, యాషెస్‌ సిరీస్‌ ద్వారా తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న స్మిత్‌ను కొనియాడాడు టేలర్‌.  చీటర్‌గానే స్మిత్‌ తన కెరీర్‌లో నిలిచిపోతాడని కొంతమంది క్రికెటర్లు అంటుంటే, టేలర్‌ మాత్రం స్మిత్‌ మళ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ కాగలడని ధీమా వ్యక్తం చేశాడు.

‘ఆసీస్‌కు తిరిగి స్మిత్‌ కెప్టెన్‌ అవుతాడనే నేను బలంగా నమ్ముతున్నా. అతనొక అత్యుత్తమ నాయకుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. స్మిత్‌పై నిషేధాన్ని విధించే క్రమంలో నేను సీఏలో సభ్యుడిగా ఉన్నాను. ఎప్పుడైతే ప్రస్తుత టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైనీకి ఆసీస్‌ ముగింపు పలుకుతుందో అప్పుడు స్మిత్‌ ముందు వరుసలో ఉంటాడు.  రీఎంట్రీలోనే స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వకపోవడం సమస్యకాదు. పైనీని ఎంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తారనేది కచ్చితంగా చెప్పలేకపోవచ్చు.  అతని తర్వాత ఆసీస్‌ను నడిపించాలంటే స్మిత్‌ ఒక్కడే సరైనవాడు’ అని టేలర్‌  అభిప్రాయపడ్డాడు.  యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా అందులో ఆసీస్‌ రెండు గెలిచి పైచేయి సాధించింది.  ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో ఆసీస్‌ 2-1 ఆధిక్యం సాధించిందంటే అందులో ప్రధాన పాత్ర స్మిత్‌దే. ఇప్పటివరకూ ఒక డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలతో స్మిత్‌ 671 పరుగులు నమోదు చేశాడు.

మరిన్ని వార్తలు