బ్యాట్‌తో పరుగులే కాదు.. ఎగిరి పట్టేస్తా!

15 Sep, 2019 10:36 IST|Sakshi

లండన్‌: యాషెస్‌ సిరీస్‌లో పరుగుల మోత మోగిస్తున్న ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌.. ఒక అద్భుతమైన క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బ్యాట్‌తో పరుగులే కాదు.. అవసరమైతే గాల్లో ఎగిరి మరీ సొగసైన క్యాచ్‌తో అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తడంలోనూ తాను ముందే ఉంటానని చెప్పకనే చెప్పాడు. ప్రతిష్టాత్మక యాషెస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆడుతున్న సమయంలో క్రిస్‌ వోక్స్‌  ఇచ్చిన క్యాచ్‌ను సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్మిత్‌ అసాధారణ రీతిలో అందుకున్నాడు.  మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో వోక్స్‌ బ్యాట్‌కు తగిలిన బంతిని రెప్పపాటులో అంచనా వేసిన స్మిత్‌ దాన్ని తన నుంచి దాటి పోకుండా ఒడిసి పట్టుకున్నాడు.

స్కోరును పెంచే క్రమంలో వోక్స్‌ బంతిని హిట్‌ చేయగా అది ఎక్స్‌ట్రా ఎడ్జ్‌ తీసుకుంది. అది స్మిత్‌ను దాటితో ఫోర్‌కు వెళ్లేదే. కానీ ఆ అవకాశాన్ని స్మిత్‌ ఇవ్వలేదు. చక్కటి టైమింగ్‌తో దాన్ని డైవ్‌ కొట్టి మరీ అందుకున్నాడు.  ఇది సహచర క్రికెటర్లతో పాటు ఆసీస్‌ అభిమానుల్ని కూడా సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇదిలా ఉంచితే, ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టును ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్న ఇంగ్లండ్‌ పట్టు బిగించింది.  శనివారం మూడో  రోజు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ఫలితంగా 383 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది.  జాన్‌ డెన్లీ (94), ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ (67) అర్ధశతకాలకు తోడు బట్లర్‌ (47) రాణించడంతో  ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు