ఆ జాబితాలో మిథాలి తర్వాత మంధాననే

18 Nov, 2018 09:02 IST|Sakshi
స్మృతి మంధాన

ప్రొవిడెన్స్‌ (గయానా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో మహిళా క్రికెటర్లు అదరగొడుతున్నారు. వరుసగా నాలుగో విజయం సాధించి సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, సీనియర్‌ మిథాలీ రాజ్‌లు అద్భుత ఇన్నింగ్స్‌లతో విజయాలందించగా.. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన టచ్‌లోకి వచ్చింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో 2, 26, 33లతో నిరాశ పర్చిన మంధాన ఆసీస్‌తో 55 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులతో విజృంభించింది. ఈ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ పటిష్టమైన ఆసీస్‌పై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మంధాన ఈ మ్యాచ్‌లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. 

భారత మహిళా టీ20 క్రికెటర్లలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 49 ఇన్నింగ్స్‌ల్లో మంధాన ఈ ఫీట్‌ సాధించగా.. మిథాలీ రాజ్‌ 44 ఇన్నింగ్స్‌ల్లో 2014ల్లోనే ఈ రికార్డు నమోదు చేసింది. ఇక భారత మహిళా క్రికెటర్లలో మిథాలీ (2283), హర్మన్‌ ప్రీత్‌ (1870) తర్వాత మంధానానే వెయ్యి పరుగులు పూర్తిచేసింది. అంతేకాకుండా టీ20 ప్రపంచ కప్‌లో మంధాన వేగవంతమైన అర్ధశతకం (31 బంతుల్లో) నమోదు చేసింది. ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌పై 33 బంతుల్లో హర్మన్‌ప్రీత్‌ సాధించిన ఈ ఫీట్‌ను అధిగమించింది.

మరిన్ని వార్తలు