తొలి మ్యాచ్‌లోనే మంధానకు చేదు అనుభవం!

4 Mar, 2019 16:40 IST|Sakshi

గువాహటి : అస్సాంలోని బర్సాపరా క్రికెట్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా జట్టు పరాజయం పాలైంది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక మంధాన సేన ఓటమి చవిచూసింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆతిథ్య జట్టు వెనుకబడింది. టీమిండియా బ్యాటర్లలో దీప్తి శర్మ(22), అరుంధతి రెడ్డి(18), శిఖా పాండే(23) మాత్రమే రాణించారు. కెప్టెన్‌ స్మృతి మంధాన(2) సహా సీనియర్‌ బ్యాటర్‌ మిథాలీ రాజ్‌(7) స్వల్ప స్కోరుకే పరిమితం కావడంతో.. భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేసింది.

రెండు విభాగాల్లో వైఫల్యం వల్లే
మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ మంధాన మాట్లాడుతూ.. ‘ 10 నుంచి 15 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చాం. అదే విధంగా మాకు సరైన ఆరంభం కూడా లభించలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో వైఫల్యం వల్లే ఓటమి పాలయ్యాం. అయితే అరుంధతి, దీప్తి శర్మ, శిఖాలు రాణించడంతో మెరుగైన స్కోరు సాధించాం. భవిష్యత్తు మ్యాచుల్లో ఈ అంశం మాకు సానుకూలంగా మారనుంది. గతం గురించి ఆలోచించకుండా జరుగనున్న మ్యాచులపై దృష్టి సారిస్తాం’ అని వ్యాఖ్యానించింది.

కాగా టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో... ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టి20 జట్టుకు స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన తొలిసారిగా నాయకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం నాటి మ్యాచులో టాస్‌ గెలిచిన మంధాన ఇంగ్లండ్‌ జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచి దూకుడుగా ఆడిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బ్యాటర్స్‌ టామీ బూమంట్‌ (62), డేనియల్‌ వ్యాట్‌(35)తో కెప్టెన్‌ హెదర్‌ నైట్‌(40) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా