మంధాన అదరహో

18 Feb, 2019 20:37 IST|Sakshi

దుబాయ్‌ : భారత మహిళా క్రికెట్ అనగానే మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే కాదు.. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా కూడా అని అనుకొనే రోజులు వచ్చాయి. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై విశ్వరూపం ప్రదర్శించి.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సైతం మంధానా పరుగుల జోరు కొనసాగించింది. ప్రస్తుతం కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ప్రత్యర్థిజట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది ఈ మరాఠా మెరుపుతీగ. తన బ్యాటింగ్‌ మెరుపులతో తాజాగా ఐసీసీ ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన ఆగ్రస్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా బ్యాటర్‌ ఎలైసే పెర్రీ, మెగ్‌ లానింగ్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నారు

ఇక ఈ జాబితాలో సీనియర్‌ బ్యాటర్‌, వన్డే సారథి మిథాలీ రాజ్‌ ఐదో స్థానాన్ని కాపాడుకోగా.. దీప్తి శర్మ, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌లు టాప్‌ 20లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్‌ జాబితాలో జులాన్‌ గోస్వామి మూడో స్థానంలో కొనసాగుతుండగా.. దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌లు వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో పాకిస్తాన్‌ బౌలర్‌ సనా మిర్‌ ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ గెలిచిన మిథాలీ సేన టీమ్‌ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. టీమ్‌ జాబితాలో ఆసీస్‌ ఆగ్ర స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్‌ రెండో స్థానంలో నిలిచింది.  

మరిన్ని వార్తలు