బోల్ట్‌... నాడు రియల్, నేడు వైరల్‌

15 Apr, 2020 08:52 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉసేన్‌ బోల్ట్‌ అంటే క్రీడాలోకానికి బాగా తెలుసు... చాంపియన్‌ స్ప్రింటర్‌ అని! బీజింగ్‌ ఒలింపిక్స్‌లో మొదలైన అతని విజయపరంపర తదనంతరం డైమండ్‌ లీగ్‌లు, ప్రపంచ చాంపియన్‌ షిప్‌లదాకా సాగింది. పుష్కరకాలం క్రితం బీజింగ్‌లో పరుగుల చిరుతగా, రియల్‌ హీరోగా రికార్డుల తెరకెక్కిన బోల్ట్‌ ఇప్పుడు 12 ఏళ్లు అయ్యాక కూడా వార్తల్లోకెక్కాడు. చిత్రంగా అదే చాంపియన్‌ ఫొటోతో! 2008 ఒలింపిక్స్‌లో జరిగిన 100 మీటర్ల రేసును బోల్ట్‌ 9.69 సెకన్ల రికార్డు టైమింగ్‌తో ముగించి చరిత్రకెక్కాడు. 

అప్పుడు విజేతగా నిలిచి న క్షణాల్ని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్‌ నికోలస్‌ తన కెమెరాలో బంధించాడు. ఇందులో బోల్ట్‌ అందరికంటే ముందుగా, వేగంగా, తోటి పోటీదారులు ఫినిషింగ్‌ లైన్‌కు దూరంగా ఉండగానే ముగించాడు. ఇందు లో సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్సింగ్‌) కోణం కనబడుతుంది. మహమ్మారి విజృంభణతో ఇప్పు డు ప్రపంచమంతా ఈ దూరంతోనే బతికేస్తోంది. అందుకే నాటి ఫొటో అప్పుడు ఎంతగా పతాక శీర్షికలకు ఎక్కిందో... ఇప్పుడు కూడా అంతే తాజాగా సామాజిక సైట్లలో వైరల్‌ అయింది. 

ఇప్పుడీ ఫొటో వేలసంఖ్యలో రీట్వీట్‌ కాగా.. లక్షలకొద్దీ లైక్‌లు వచ్చాయి. నిజంగా ఈ జమైకన్‌ స్ప్రింటర్‌ అప్పుడు రియల్‌... ఇప్పుడేమో వైరల్‌ ‘చాంపియన్‌’ అయ్యాడు కదా! అన్నట్లు ఈ రిటైర్డ్‌ చాంపియన్‌ కోవిడ్‌–19పై పోరులో జమైకాను జాగృతం చేస్తున్నాడు. మహమ్మారికి మందు దూరంగా ఉండటమేనంటూ, గడపదాటకుండా గడపడమే సురక్షితమంటూ ప్రచారం చేస్తున్నాడు. ఈ సంక్షోభంలో నిధుల సేకరణలోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.  

చదవండి:
ఊ.. 500 సార్లు రాయండి.. 
పోలీసాఫీసర్‌గానూ.. డాక్టర్‌గానూ

మరిన్ని వార్తలు