కెప్టెన్సీపై తిరుగుబాటు చేశారు..

4 May, 2020 11:53 IST|Sakshi

కావాలనే సిరీస్‌ ఓడిపోయాం

ఆ కుట్రలో నన్ను భాగం కావాలన్నారు: రాణా

కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్‌ క్రికెట్‌లోని మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు ఏదొక సరికొత్త వివాదాన్ని తెరపైకి తెస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా పాకిసాన్‌ మాజీ పేసర్‌ రాణా నవీద్‌.. సంచలన ఆరోపణలు చేశాడు. దాదాపు 11 ఏళ్ల నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ అప్పుడు తమ క్రికెటర్లు ఎలా తిరుగుబాటు చేశారో చెప్పుకొచ్చాడు. 2009లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ జరిగిన క్రమంలో తమ జట్టులోని పలువురి ఆటగాళ్లు కావాలనే మ్యాచ్‌లు ఓడిపోయారన్నాడు. తాము తొలి వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించి గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేలను కోల్పోయామన్నాడు. అందుకు ఆనాడు కెప్టెన్‌గా ఉన్నయూనిస్‌ ఖానే కారణమన్నాడు. ‘ ఆ సమయంలో యూఏఈ వేదికగా కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మేము 1-2తో కోల్పోయాం. (‘పాక్‌ క్రికెటర్లు.. చిల్లర మాటలు ఆపండి’)

ఇక్కడ తొలి వన్డేలో గెలిచి ఆధిక్యంలో నిలిచినా మిగిలిన రెండు వన్డేల్లో పరాజయం చెంది సిరీస్‌ను సమర్పించుకున్నాం. ఆ సిరీస్‌లో కుట్ర జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను దూరంగా ఉన్నా. నీపై కుట్ర జరుగుతుందనే విషయాన్ని యూనిస్‌కు చెప్పా. కానీ నన్ను కూడా కుట్రలో భాగం కావాలని పట్టుబట్టారు. ఇందుకు కారణం యూనిస్‌ ఖాన్‌ కెప్టెన్సీనే. వ్యక్తిగా యూనిస్‌ ఖాన్‌పై మా సీనియర్‌ క్రికెటర్లకు ఎవరికీ వ్యతిరేకత లేకపోయినా, కెప్టెన్‌గా అతని వైఖరి నచ్చలేదు.  కెప్టెన్‌ అయిన తర్వాత యూనిస్‌ మొత్తం మారిపోయాడు. అతని వ్యక్తిత్వం,నడవడిక పూర్తిగా మారిపోయాయి. దీనిపై కొంతమంది ఆటగాళ్లు ఫిర్యాదు కూడా చేశారు. అనవసరంగా యూనిస్‌ తిడుతున్నాడని వాపోయారు. ఇదే మా ఆటగాళ్ల ఆనాటి తిరుగుబాటుకు కారణం’ అని రాణా నవీద్‌ చెప్పుకొచ్చాడు. ఆనాటి సిరీస్‌లో మహ్మద్‌ యూసఫ్‌, షాహిద్‌ ఆఫ్రిది, షోయబ్‌ మాలిక్‌,కమ్రాన్‌ అక్మల్‌, సయాద్‌ అజ్మల్‌లు సీనియర్‌ క్రికెటర్లుగా ఉన్నారు. ఇక పాకిస్తాన్‌ తరఫున 9 టెస్టులు, 74 వన్డేలు, 4 టీ20ల్లో నవీద్‌ ప్రాతినిథ్యం వహించాడు. (విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్‌)

మరిన్ని వార్తలు