సారీ అనిల్‌ భాయ్‌: సెహ్వాగ్‌

17 Oct, 2019 12:29 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్‌, మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే 49వ పుట్టినరోజు సందర్భంగా అతనితో కలిసి ఆడిన సహచర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ సరికొత్తగా శుభాకాంక్షలు తెలియజేశాడు. భారత్‌ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన ఘనతతో పాటు ఒకే ఒక్క సెంచరీని కూడా కుంబ్లే సాధించాడు. టెస్టుల్లో 619 వికెట్లతో భారత్‌ తరఫున టాప్‌లో కొనసాగుతుండగా, 2007లో ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే శతకంతో మెరిశాడు.

దీన్ని సెహ్వాగ్‌ గుర్తు చేస్తూ తనదైన శైలిలో కుంబ్లేకు విషెస్‌ తెలియజేశాడు. ‘ భారత దిగ్గజ క్రికెటర్లలో నువ్వు కూడా ఒకడివి. భారత్‌కు అనేక చిరస్మరణీయమైన విజయాలు అందించి మా అందరికీ ఒక అద్భుతమైన రోల్‌ మోడల్‌గా నిలిచావు. కానీ నీ కెరీర్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని దూరం చేసినందుకు సారీ. నిజ జీవితంలో నువ్వు సెంచరీ కొట్టాలని ప్రార్థిస్తున్నా. హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలచుకో. కమాన్‌.. కమాన్‌ అనిల్‌ భాయ్‌.. హ్యాపీ బర్త్‌ డే’ అంటూ సెహ్వాగ్‌ తన ట్వీట్‌ ద్వారా అభినందనలు తెలిపాడు. ఇక్కడ కుంబ్లే ఆటగాళ్లతో కలిసి బర్త్‌ డే చేసుకున్న ఫొటోను పోస్ట్‌ చేశాడు.

ఇక వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ భజ్జీ కూడా కుంబ్లేకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నువ్వు భారత్‌కు అతి పెద్ద మ్యాచ్‌ విన్నర్‌. నువ్వు ఒక గ్రేటెస్ట్‌ స్పిన్నర్‌. నా బౌలింగ్‌ పార్టనర్‌, నా గురువు కుంబ్లేకు ఇవే నా  విషెస్‌’ అని భజ్జీ పేర్కొన్నాడు. దానికి రిప్లే ఇచ్చిన కుంబ్లే.. ‘థాంక్యూ భజ్జీ..  ఇప్పుడు నీ నుంచి కొన్ని పంజాబీ పాఠాలు నేర్చుకోవాలి’ అని బదులిచ్చాడు. ఇటీవల కింగ్స్‌ పంజాబ్‌ హెడ్‌ కోచ్‌గా కుంబ్లే నియమించబడిన సంగతి తెలిసిందే. దాంతోనే భజ్జీ నుంచి పంజాబీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కుంబ్లే చమత్కరించాడు.

మరిన్ని వార్తలు