సౌజన్య జంటకు డబుల్స్ టైటిల్

8 Oct, 2016 10:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సాధించింది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రిషిక సుంకరతో కలసి సౌజన్య విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య-రిషిక ద్వయం 4-6, 6-1, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో శ్వేతా రాణా (ఢిల్లీ)-ఇతీ మెహతా (గుజరాత్) జోడీపై విజయం సాధించింది.

 

అండర్-18 బాలికల డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి శ్రావ్య శివాని-తనీషా కశ్యప్ (అస్సాం) జంట 6-1, 7-6 (7/5)తో సభ్యత నిహ్లాని (ఢిల్లీ)-యుబ్రాని బెనర్జీ (బెంగాల్) జోడీని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.

 ఫైనల్లో హుమేరా
 అండర్-18 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి షేక్ హుమేరా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో హుమేరా 4-6, 6-3, 6-2తో హైదరాబాద్‌కే చెందిన యెద్దుల సారుు దేదీప్యపై కష్టపడి గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో ఆకాంక్ష భాన్ (గుజరాత్)తో హుమేరా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ఆకాంక్ష 6-2, 6-1తో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు లలిత దేవరకొండను ఓడించింది.

 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల 4-6, 3-6తో ఇతీ మెహతా (గుజరాత్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో విష్ణు 6-3, 6-1తో కునాల్ ఆనంద్ (ఢిల్లీ)పై గెలిచాడు. ఫైనల్లో సిద్ధార్థ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్)తో విష్ణు ఆడతాడు.


 

మరిన్ని వార్తలు