విజేత సౌరభ్‌ వర్మ

12 Aug, 2019 05:31 IST|Sakshi

హైదరాబాద్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ సొంతం

మహిళల డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సిక్కి రెడ్డి–అశ్విని జోడీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ ఈ ఏడాది రెండో అంతర్జాతీయ సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ముగిసిన హైదరాబాద్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో సౌరభ్‌ వర్మ పురుషుల సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. 52 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సౌరభ్‌ వర్మ 21–13, 14–21, 21–16తో లో కీన్‌ యె (సింగపూర్‌)పై విజయం సాధించాడు. మేలో సౌరభ్‌ వర్మ స్లొవేనియా ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు.

‘ఈ టోర్నీలో నా ప్రదర్శన పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. పలు హోరాహోరీ మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకున్నాను. ఫైనల్లో తొలి గేమ్‌ గెలిచాక రెండో గేమ్‌లో ఆధిక్యంలో ఉన్న దశలో ఏకాగ్రత కోల్పోయాను. తొందరగా మ్యాచ్‌ను ముగించాలనే ఉద్దేశంతో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ వ్యూహం మార్చి ప్రత్యర్థిపై పైచేయి సాధించాను’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల సౌరభ్‌ వర్మ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన సౌరభ్‌ వర్మకు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.
 
మహిళల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంటకు నిరాశ ఎదురైంది. బేక్‌ హా నా–జుంగ్‌ క్యుంగ్‌ యున్‌ (దక్షిణ కొరియా) జోడీతో జరిగిన ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 17–21, 17–21తో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచిన సిక్కి–అశ్విని జోడీకి 2,850 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 4,680 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

మరిన్ని వార్తలు