రష్యా ఓపెన్‌ చాంప్‌ సౌరభ్‌

30 Jul, 2018 01:27 IST|Sakshi

రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టైటిల్‌ 

వ్లాదివోస్టాక్‌ (రష్యా): భారత షట్లర్‌ సౌరభ్‌ వర్మ  బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌–100 రష్యా ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌  ఫైనల్లో 25 ఏళ్ల సౌరభ్‌ 19–21, 21–12, 21–17తో కొకి వతనబె (జపాన్‌)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరభ్‌కు 5,625 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 86 వేలు)తోపాటు 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ‘ప్రస్తుతం నా ఆటతీరు మెరుగు పర్చుకునేందుకు కష్టపడుతున్నా. ఇందులో పురోగతి సాధించినప్పటికీ ఇంకా కొన్ని అంశాల్లో నిలకడ ప్రదర్శించాల్సివుంది.

ఈ ఫైనల్‌ పోరు క్లిష్టంగా సాగింది. చివరకు గెలిచినందుకు ఆనందంగా ఉంది’ అని రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టైటిల్‌ గెలిచిన సౌరభ్‌ అన్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్‌ 2016లో చైనీస్‌ తైపీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ గెలిచి, బిట్‌బర్గర్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రెండో సీడ్‌ భారత జంట రోహన్‌ కపూర్‌– కుహూ గార్గ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. టైటిల్‌ పోరులో ఈ జోడీ 19–21, 17–21తో ఇవనోవ్‌ (రష్యా)–మిక్‌ క్యుంగ్‌ కిమ్‌ (కొరియా) ద్వయం చేతిలో పరాజయం చవిచూసింది. 
 

మరిన్ని వార్తలు