మను–సౌరభ్‌ జంటకు స్వర్ణం 

10 Nov, 2018 02:23 IST|Sakshi

కువైట్‌ సిటీ: యువ షూటర్లు మను భాకర్, సౌరభ్‌ చౌదరి జోరు కొనసాగిస్తున్నారు. ఇటీవల యూత్‌ లో స్వర్ణాలు నెగ్గిన ఈ ఇద్దరు ఆసియా ఎయిర్‌గన్‌ చాంపియన్‌షిప్‌లో పసిడిని చేజిక్కించుకున్నారు. శుక్రవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మను–సౌరభ్‌ జంట 485.4 పాయింట్లు స్కోరు చేసి జూనియర్‌ ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది. సౌరభ్‌కు ఈ టోర్నీలో ఇది మూడో స్వర్ణం. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లలో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాడు.

వాంగ్‌ జియాయు–జీ హాంగ్‌ సుఖి (చైనా, 477.9 పాయింట్లు) జోడీకి రజతం, వాంగ్‌–హాంగ్‌ (చైనా, 413.5) జంటకు కాంస్యం లభించాయి. భారత్‌కే చెందిన మరో ద్వయం అభిజ్ఞ పాటిల్‌–అన్‌మోల్‌ జైన్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో మను–సౌరభ్‌ 762, అభిజ్ఙ–అన్‌మోల్‌ 760 పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరారు. ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 11 (4 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు సాధించింది.    

మరిన్ని వార్తలు