ఒక్కసారి దాదా ఫిక్స్‌ అయ్యాడంటే..

3 Jun, 2020 17:34 IST|Sakshi

సౌరవ్‌ గంగూలీ సపోర్ట్‌ సెపరేటు

నమ్మితే ఇక నీవెంటే ఉంటాడు

ఆనాటి జ్ఞాపకాల్ని షేర్‌ చేసుకున్న ఇర్ఫాన్‌

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో ఉన్న గత జ్ఞాపకాలను మాజీ ఆల్‌ రౌండర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ మరోసారి షేర్‌ చేసుకున్నాడు. ఆటపట్ల అత్యంత నిబద్ధత కల్గిన గంగూలీ.. ఒకసారి ఒక ప్లేయర్‌ను నమ్మాడంటే అతని కోసం ఎంతవరకూ అయినా వెళతాడన్నాడు. మన అత్యున్నత ప్రదర్శన కనబరిచిన క్రమంలో గంగూలీ నుంచి లభించిన సహకారం మరవలేనిదన్నాడు. గంగూలీ చాలా మంది క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా వారికి సపోర్ట్‌గా ఉండేవాడన్నాడు. తాను కూడా అలా వచ్చిన క్రికెటర్‌నేనని ఇర్ఫాన్‌ గుర్తు చేసుకున్నాడు. తనకు గంగూలీ నుంచి ఎక్కువ మద్దతు లభించడం వల్లే సుదీర్ఘ కాలం క్రికెట్‌లో కొనసాగానన్నాడు. దీనిలో భాగంగా 2003లో ఆస్ట్రేలియా పర్యటన ద్వారా అరంగేట్రం చేయడాన్ని ఇర్ఫాన్‌ తెలిపాడు. (హార్దిక్‌ మాటల్లో ఆంతర్యం ఏమిటి?)

తన అరంగేట్రం ట్విస్ట్‌ల మధ్య జరిగిందన్నాడు. ‘ నాకు 19 ఏళ్లప్పుడు టీమిండియా జట్టులో అరంగేట్రం చేశా. నా తొలి సిరీస్‌ ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో ఆడాల్సి వచ్చింది. అది ఒక కఠినమైన సిరీస్‌. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ముందు నేను లేను. నా వయసును బట్టి గంగూలీ నన్ను ఎంపిక చేయలేదు. నా ఎంపిక ఉంటుందని ఊహించుకుని కూర్చొన్నా. కానీ నన్ను ఎంపిక చేయడానికి గంగూలీ ఇష్టపడలేదు. దాంతో నిరాశ చెందా. కాకపోతే ఆస్ట్రేలియా పర్యటన దాదాపు చివరకు వచ్చేసిన సమయంలో నాకు పిలుపు వచ్చింది. అప్పుడు నాకు గంగూలీ ఒక్కటే చెప్పాడు. నీకు ఒక విషయం తెలియకపోవచ్చు. నిన్ను ఈ పర్యటనకు నేనే వద్దన్నా. నీ వయసు దృష్ట్యా పెద్ద సిరీస్‌కు ఎంపిక చేయడానికి ఇష్టపడలేదు. కానీ నీపై నమ్మకంతోనే పిలిపించా. నీ బౌలింగ్‌ను నేను చూశా. నువ్వు అత్యుత్తమ ప‍్రదర్శన ఇస్తావనే నమ్మకం ఉంది అని గంగూలీ చెప్పాడు. అలా గంగూలీ నమ్మకాన్ని నిలబెట్టుకుని జట్టులో రాణించాను’ అని పఠాన్‌ చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్‌ తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్‌ అనేక విషయాల్ని పంచుకున్నాడు. తన అరంగేట్రంలో దిగ్గజ క్రికెటర్లు వసీం అక్రమ్‌, కపిల్‌ దేవ్‌లను కలిశానన్నాడు. వారిద్దరూ ఆస్ట్రేలియాలో ఉండటంతో వారిని కలుసుకుని అనేక విషయాలను తెలుసుకున్నానన్నాడు. తనకు కపిల్‌దేవ్‌ ఒక రోల్‌ మోడల్‌ అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. తాను ఎక్కువగా కపిల్‌ను ఫాలో అయ్యేవాడినని ఇర్ఫాన్‌ అన్నాడు. (నాది కూడా అభినవ్‌ వర్ణ వివక్ష స్టోరీనే)

మరిన్ని వార్తలు