భారత క్రికెట్‌లో మళ్లీ ‘దాదా’గిరి!

15 Oct, 2019 04:05 IST|Sakshi
సౌరవ్‌ గంగూలీ

కొత్త పాత్రలో మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ

బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు

ఏకైక నామినేషన్‌తో ‘దాదా’ ఎన్నిక లాంఛనం

బోర్డు రాత మారుస్తానంటున్న మాజీ కెప్టెన్‌  

దాదాపు 20 ఏళ్ల క్రితం... భారత క్రికెట్‌ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సౌరవ్‌ గంగూలీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడే బయటపడ్డ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం బీసీసీఐ పరువు తీసింది. కెప్టెన్సీ నా వల్ల కాదంటూ సచిన్‌ స్వచ్ఛందంగా తప్పుకుంటూ కీలక సమయంలో కాడి పడేశాడు. అలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దగలడంటూ గంగూలీని నమ్మి బోర్డు బాధ్యతలు అప్పగించింది. కెప్టెన్‌గా తన తొలి వన్డే సిరీస్‌ను గెలిపించడంతో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన సౌరవ్‌... తదనంతర కాలంలో భారత క్రికెట్‌ రాత మార్చిన అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచాడు.

ఇప్పుడు కూడా... భారత క్రికెట్‌ పరిపాలన పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు... ఎన్నికైన ఆఫీస్‌ బేరర్లతో కాకుండా 33 నెలలుగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) నేతృత్వంలోనే పాలన నడుస్తోంది. అవగాహనలేమి, అనుభవలేమివంటి సమస్యలతో సీఓఏ తీసుకున్న ఎన్నో నిర్ణయాలు క్రికెట్‌ను దెబ్బ తీశాయి. అర్థంపర్థం లేని నిబంధనలు సరైన నిర్ణయాధికార వ్యవస్థ లేకుండా గందరగోళానికి దారి తీశాయి. ఇలాంటి సమయంలో గంగూలీ బోర్డు అధ్యక్షుడిగా వస్తున్నాడు. అభిమానులు ఆత్మీయంగా ‘దాదా’ అని పిలుచుకునే బెంగాలీ బాబు ఇక్కడా తన ముద్ర చూపించగలడా! వేచి చూడాలి. 
 
ముంబై:
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని బాగు చేసేందుకు ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు కాబోయే కొత్త అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యానించాడు. అందు కోసమే ఇక్కడ అడుగు పెట్టినట్లు అతను చెప్పాడు. సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం గంగూలీ మీడియాతో మాట్లాడాడు. అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. ఈ నేపథ్యంలో వేర్వేరు అంశాలపై తన ఆలోచనలు, ప్రణాళికల గురించి సౌరవ్‌ వివరించాడు. విశేషాలు అతని మాటల్లోనే...

పూర్వ వైభవం తెస్తా...
దేశం తరఫున ఆడి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన నాకు ఈ పెద్ద పదవి దక్కడం కూడా గొప్పగా అనిపిస్తోంది. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి ఏమీ బాగా లేదు. ఇప్పటికే బోర్డు పేరు ప్రఖ్యాతులు బాగా దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో నేను బాధ్యతలు చేపడుతున్నాను. కాబట్టి దీనిని చక్కబెట్టేందుకు నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నా. వచ్చే కొన్ని నెలల్లో అన్నీ సరిదిద్ది సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాం. అపెక్స్‌ కౌన్సిల్‌లోని నా సహచరులందరితో కలిసి పని చేసి బీసీసీఐకి పూర్వ వైభవం తీసుకొస్తాం.

వారి మ్యాచ్‌ ఫీజు పెంచాలి...
ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అందరం కలిసి చర్చిస్తాం. అయితే నా మొదటి ప్రాధాన్యత మాత్రం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్ల బాగోగులు చూడటం గురించే. అప్పట్లో       దీని గురించి నేను సీఓఏకు కూడా సూచనలు చేసినా వారు పట్టించుకోలేదు. మన ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడంపై ముందుగా దృష్టి పెడతా.    వారికి లభిస్తున్న మ్యాచ్‌ ఫీజు మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.  

ఇదో సవాల్‌....
ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా లేక ఏకగ్రీవంగా ఎంపికైనా బాధ్యతలో మాత్రం తేడా ఉండదు. అందులోనూ ప్రపంచ క్రికెట్‌లో పెద్ద బోర్డుకు నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. ఆర్థికంగా బీసీసీఐ ఎంతో పరిపుష్టమైన వ్యవస్థ కాబట్టి నాకు ఇది సవాల్‌లాంటిది

ఊహించలేదు...
నేను బోర్డు అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు. మీరు అడిగినప్పుడు నేను కూడా బ్రిజేష్‌ పటేల్‌ పేరే చెప్పాను కానీ నేను పైకి వెళ్లేసరికి అంతా మారిపోయింది. నేను బోర్డు ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు కాబట్టి ఇలా కూడా అవకాశం దక్కుతుందని అనుకోలేదు. 10 నెలలకే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనుండటం పట్ల ఎలాంటి బాధ లేదు. అది నిబంధన కాబట్టి పాటించాల్సిందే. నాకు తండ్రిలాంటి జగ్మోహన్‌ దాల్మియా నిర్వహించిన బాధ్యతలను నేను కూడా చేపట్టగలనని ఎప్పుడూ ఊహించలేదు. గతంలో శ్రీనివాసన్‌లాంటి అనేక మంది వ్యక్తులు సమర్థంగా బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు.  

రాజకీయాలు మాట్లాడలేదు...
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు. నేను ఎలాంటి హామీ ఇవ్వలేదు. నాతో ఏ రాజకీయ నాయకుడు కూడా సంప్రదింపులు జరపలేదు. నాకు అభినందన సందేశం పంపిన బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు.

సమర్థుడు కావాలని....
భారత జట్టు కెప్టెన్‌గా ఆడటంకంటే గొప్ప గౌరవానికి మరేదీ సాటి రాదు. 2000లో నేను కెప్టెన్‌ అయినప్పుడు కూడా ఫిక్సింగ్‌లాంటి సమస్యలు ఉన్నాయి. నేను వాటిని సరిదిద్దగలనని వారు భావించారు. ఇక్కడ అధ్యక్షుడు అయ్యే వ్యక్తి ఆటగాడా, కాదా అనేది అనవసరం. సమర్థుడు కావడం ముఖ్యం. ఐసీసీకి 75–80 శాతం ఆదాయం భారత క్రికెట్‌ నుంచే వస్తున్నా... గత మూడు నాలుగేళ్లుగా మనకు న్యాయంగా వారి నుంచి ఆశించిన రీతిలో నిధులు రావడం లేదు. దీనికి పరిష్కారం కనుగొంటాం.

అదో పెద్ద సమస్య....
పరస్పర ప్రయోజనం (కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఇలా అయితే క్రికెట్‌ వ్యవస్థలో అత్యుత్తమ వ్యక్తులను తీసుకొచ్చి పని చేయించుకోవడం కష్టమైపోతుంది. వారు వేరే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తారు. ఒక వ్యక్తికి ఒకే పోస్టు అనే నిబంధన పాటిస్తే మాజీ ఆటగాళ్లెవరూ ముందుకు రారు. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత వారికి ఆర్థిక భద్రత లేకపోతే మనసు పెట్టి ఎలా పని చేస్తారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు