ఆసీస్‌ పర్యటనలో భారత క్రికెటర్లకు క్వారంటైన్‌ సమయం కుదించాలి

13 Jul, 2020 00:58 IST|Sakshi

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెటర్లకు క్వారంటైన్‌ సమయాన్ని కుదిస్తే బాగుంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆకాంక్షించాడు. మిగతా వాటితో పోలిస్తే ఆసీస్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లను క్వారంటైన్‌ పేరిట రెండు వారాలపాటు హోటల్‌ గదులకే పరిమితం చేయకూడదని అభిప్రాయపడ్డాడు. ‘డిసెంబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించడం ఖాయం. అంత దూరం వెళ్లి రెండు వారాలు హోటల్‌కే పరిమితమవ్వాలంటే ఆటగాళ్లకు చాలా నిరాశగా ఉంటుంది. మెల్‌బోర్న్‌ మినహా ఆసీస్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా లేనందున క్వారంటైన్‌ సమయం కుదింపునకు ప్రయత్నిస్తాం’ అని ‘దాదా’ పేర్కొన్నాడు. తమ పదవీకాలం పొడిగింపు కోసం సుప్రీం కోర్టులో బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌ గురించి గంగూలీ మాట్లాడుతూ ‘మాకు కొనసాగింపు లభిస్తుందో లేదో నేను చెప్పలేను. ఒకవేళ సుప్రీంకోర్టు పొడిగింపునకు అనుమతివ్వకపోతే నేను మరో పనిలో నిమగ్నమవుతా’ అని అన్నాడు.

మరిన్ని వార్తలు