ఆ మ్యాచ్‌తోనే హర్భజన్‌కు ఫిదా అయ్యా : గంగూలీ

2 Jan, 2020 20:51 IST|Sakshi

భారత టెస్టు క్రికెట్‌లో 2001 సంవత్సరం మరిచిపోలేనిది. ఎందుకంటే ఆ సంవత్సరమే భారత టెస్టు క్రికెట్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటికే 16 వరుస విజయాలతో క్రికెట్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియా జట్టును ఈడెన్‌గార్డెన్స్‌లో భారత్‌ ఓడించిన తీరు క్రికెట్‌ ప్రేమికులకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మరోసారి ఆ మ్యాచ్‌ గురించి ప్రస్తావించాడు. ఆ మ్యాచ్‌లో వివిఎస్‌ లక్ష్మణ్‌ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో పాటు ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ను అందరూ గుర్తు పెట్టుకునే ఉంటారు. కాగా, ఆ మ్యాచ్‌లో మేము గెలవడానికి బ్యాట్సమెన్‌ సహకారం ఎంత ఉందో బౌలర్ల కృషి కూడా అంతే ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

ఆ మ్యాచ్‌కు సంబంధించి సౌరవ్‌ గంగూలీ కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ..' ఈడెన్‌ టెస్టు మ్యాచ్‌లో నా సూచనలతో బౌలింగ్‌కు దిగి హర్భజన్‌ హ్యాట్రిక్‌తో మెరవడం, అదే మ్యాచ్‌లో మొత్తం 13 వికెట్లు పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ మ్యాచ్‌ తర్వాత హర్భజన్‌ ప్రదర్శనను చూసి నేను అతని ఆటకు ఫిదా అయిపోయా. ఎందుకంటే అప్పటకే ఆస్ట్రేలియా 15 వరుస విజయాలు సాధించి అప్రతిహాతంగా దూసుకుపోతుంది. స్టీవా నేతృత్వంలో మా గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా మొదటి టెస్టును గెలిచి 16వ విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈడెన్‌లో జరిగిన రెండో టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు ఆ  తర్వాత సిరీస్‌ను గెలుచుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి హర్భజన్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 700 పైగా వికెట్లు సాధించి ఈ దశాబ్దపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. సమకాలీన భారత క్రికెట్లో అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌లు మా జట్టులో ఉండడం మేం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి ఎన్నో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టుకు అపూర్వమైన విజయాలు అందించారని' దాదా చెప్పుకొచ్చాడు.అయితే 2001లో కీలకమైన ఆస్ట్రేలియా  టెస్టు సిరీస్‌కు దిగ్గజ బౌలర్‌ అనిల్‌ కుంబ్లేతో పాటు ఫాస్ట్‌ బౌలర్‌ జగవల్‌ శ్రీనాథ్‌లు గాయంతో దూరమయ్యారని గంగూలీ పేర్కొన్నాడు.

'ఇదే సిరీస్‌లో నా కెప్టెన్సీలో హర్భజన్‌కు జోడిగా మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లతో బరిలోకి దిగాము. మొదటి మ్యాచ్‌లో రాహుల్‌ సింగ్వీ, రెండో మ్యాచ్‌లో వెంకటపతి రాజు, మూడో మ్యాచ్‌లో నీలేశ్‌ కులకర్ణిలను ఆడించామని' గంగూలీ గుర్తు చేశాడు. అయితే కుంబ్లే లేని లోటును తెలియకుండా హర్భజన్‌ ఆ సిరీస్‌లో ఒక చాంపియన్‌లాగా బౌలింగ్‌ చేశాడని దాదా ప్రశంసించాడు.  

ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 441 పరుగులు చేయగా, భారత్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాలోఆన్‌ ఆడిన భారత జట్టు వివిఎస్‌ లక్ష్మణ్‌ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌(281 పరుగులు), రాహుల్‌ ద్రావిడ్‌ అజేయ శతకంతో తమ రెండో ఇన్నింగ్స్‌లో 657 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 212 పరుగులకు ఆలౌట్‌ చేసి 171 పరుగులతో మ్యాచ్‌ను గెలుచుకొని ఆపై సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనే మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ హ్యాట్రిక్‌తో మెరవడం, రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 13 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం ఆ సిరీస్‌లో హర్భజన్‌ మూడు టెస్టుల్లో కలిపి  32 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

మరిన్ని వార్తలు