ధోని బలవంతం మీద తప్పక చేశాను!

4 Feb, 2018 21:31 IST|Sakshi
సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని (ఫైల్ ఫోటో)

సాక్షి, కోల్‌కతా: భారత క్రికెట్‌ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్లలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఒకరు. తనకు ముందు ఉన్న కెప్టెన్ల రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళ్లిన గంగూలీ కెరీర్ చివరి రోజుల్లో ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. గంగూలీ భాదను చూడలేక ఆయన తండ్రి రిటైర్ కావాలంటూ సూచించారట. ఈ విషయాలను తన ఆత్మకథ ‘ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లో గంగూలీ రాసుకున్నారు. త్వరలో సౌరవ్ ఆత్మకథ విడుదల కానున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

2008 నవంబర్‌లో నాగపూర్‌ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగో టెస్ట్ గంగూలీకి చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్. ‘ఆ టెస్టుకు ముందు రిటైర్మెంట్‌పై ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నాగ్‌పూర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పల్ప స్కోరుకే 9 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నా వద్దకు వచ్చాడు. కొద్దిసేపు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవాలని సూచించగా ఒప్పుకున్నాను. అయితే అదే రోజు అంతకుముందే కెప్టెన్‌గా చేయాలని నన్ను కోరగా నేను సున్నితంగా తిరస్కరించాను. మళ్లీ ఆసీస్ చివరి వికెట్ సమయంలో వచ్చి కొద్దిసేపు కెప్టెన్‌గా చేయాలంటూ ధోని బలవంతం చేయగా తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. సరిగ్గా నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి అప్పటికీ సరిగ్గా 8 ఏళ్లు పూర్తయ్యాయి. దాంతో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి మూడు ఓవర్లు ఫీల్డింగ్ సెట్ చేసిన తర్వాత మహీ ఇక నువ్వే చూసుకో అన్నాను. ఎందుకంటే నేను పూర్తిస్థాయిలో ఏకాగ్రత చూపించలేని కారణంగా చివరి వికెట్ తీసే వరకూ కెప్టెన్‌గా ఉండలేకపోయానంటూ’  గంగూలీ వివరించారు.

‘ఆ సిరీస్‌కు ముందు అనిల్ కుంబ్లేను కలిసి నన్ను జట్టులోకి తీసుకుంటారా.. నీకు ఏమైనా తెలుసా అని అడిగాను. మళ్లీ నేను కెప్టెన్ అవుతానా.. నా సేవలు టీమిండియాకు అవసరమవుతాయా అని కుంబ్లేతో చర్చించాను. పరిస్థితులు డిమాండ్ చేస్తే నువ్వు జట్టులోకి రావడంతో పాటు మళ్లీ కెప్టెన్ అవుతావని కుంబ్లే ధైర్యం చెప్పాడు. భారత కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోల్‌కతా వీధుల్లో తిరగడానికి ఇబ్బంది పడే వాడిని. మారువేషంలో వీధుల్లో తిరుగుతూ దుర్గాదేవిని గంగలో నిమజ్జనం చేసే వరకూ ఆసక్తిగా ఉత్సవాల్లో పాల్గొనేవాడినని’  పలు విషయాలు దాదా నెమరువేసుకున్నారు.

మరిన్ని వార్తలు