యాషెస్‌ సిరీస్‌.. గంగూలీ బాటలో హర్భజన్‌

19 Aug, 2019 21:32 IST|Sakshi

హైదరాబాద్‌:  ప్రస్తుతం ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌ ఇంకా బతికే ఉందనే భావన కలుగుతోందని టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. అంతేకాకుండా మిగతా దేశాలు తమ టెస్టు క్రికెట్‌ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని సూచించాడు. గంగూలీ అభిప్రాయాన్నే టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా వ్యక్తం చేశాడు. భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలు మినహా ఏ జట్లు కూడా టెస్టుల్లో పోటీని ఇవ్వలేకపోతున్నాయని విమర్శించాడు. అన్ని జట్లు బలంగా ఉంటేనే టెస్టు క్రికెట్‌ మెరుగుపడుతుందని హర్భజన్‌ పేర్కొన్నాడు. 

 ఇక యాషెస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో వర్షం పలుమార్లు అంతరాయం కలిగించగా.. మధ్యలో ఉత్కంఠ భరితంగా సాగి.. చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు నువ్వానేనా అన్నట్లు పోరాడాయి. దీంతో క్రికెట్‌ అభిమానులకు అసలైన టెస్టు మజా లభించింది. ఏకపక్ష మ్యాచ్‌లు, రెండు మూడ్రోజుల్లోనే టెస్టు మ్యాచ్‌లు ముగుస్తున్న తరుణంలో లార్డ్స్‌ టెస్టు ఐదు రోజులు టెస్టు అభిమానులకు కనువిందు చేసిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్టులో ఆసీస్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా