షాను అప్పుడే సెహ్వాగ్‌తో పోల్చొద్దు: గంగూలీ

5 Oct, 2018 11:34 IST|Sakshi

కోల్‌కతా: అరంగేట్ర టెస్ట్‌లోనే శతకంతో కదం తొక్కిన యువ సంచలనం పృథ్వీషాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. షా బ్యాటింగ్‌ శైలి చూస్తుంటే.. మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌లు గుర్తుకొస్తున్నారని అభిమానులు కొనియాడుతున్నారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాత్రం అప్పుడే షాను సెహ్వాగ్‌తో పోల్చొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ‘సెహ్వాగ్‌తో షాను పోల్చకండి. సెహ్వాగ్‌ ఓ జీనియస్‌. షాను ప్రపంచం మొత్తం చుట్టిరానివ్వండి. అతను ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికాల్లో కచ్చితంగా రాణిస్తాడు. కానీ అప్పుడే అతన్ని సెహ్వాగ్‌తో పోల్చవద్దు. అతనికిది ఓ అసాధారణమైన రోజు. రంజీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించిన షా.. ఇప్పుడు భారత్‌ తరపున అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం అసాధారణమే’ అని చెప్పుకొచ్చాడు. (చదవండి: కేఎల్‌ రాహుల్‌.. మళ్లీనా?)

యాదృశ్చికమో కానీ  గంగూలీ సైతం తన అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం సాధించాడు. 1996లో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. దీనిపై స్పందిస్తూ.. ‘ నేను రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేయలేదు కానీ.. దులీప్‌ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే శతకం సాధించా’ అని తెలిపాడు. 

షా బ్యాటింగ్‌పై మాట్లాడుతూ.. ‘సానుకూల దృక్పథంతో కూడిన అతని బ్యాటింగ్‌ అద్భుతం. భారత్‌ తరపున అండర్‌-19 వరల్డ్‌కప్‌, ఈ టెస్టు మ్యాచ్‌లో ఆడిన అతని ఆటకు చాలా వ్యత్యాసం ఉంది. నేను అతని బ్యాటింగ్‌ చూసి గ్రహించింది ఏంటంటే.. షా భారత్‌ తరపున చాలా రోజులు ఆడగలడనే నమ్మకం కలిగింది. అతని సెంచరీతో బౌలర్లను డామినేట్‌ చేశాడు. అతను కొత్తగా ఆడాడు. అతను ఈ రోజు అద్భుతం సృష్టించాడు. షాకు అభినందనలు’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక పిన్న వయసులో సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో సచిన్‌ (17 ఏళ్ల 107 రోజులు) తర్వాత పృథ్వీ షా (18 ఏళ్ల 329 రోజులు) రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. చదవండి : షా.. కొంచెం సెహ్వాగ్‌ కొంచెం సచిన్‌ : రవిశాస్త్రి

>
మరిన్ని వార్తలు