‘ద్రవిడ్‌ను తీవ్రంగా అవమానించారు’

7 Aug, 2019 12:34 IST|Sakshi

టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు ఇవ్వడంపై మాజీ సారథి గంగూలీ తీవ్రంగా స్పందించాడు. భారత క్రికెట్‌లో ఇదొక కొత్త ఫ్యాషన్‌ అయిపోయిందని, వార్తల్లో నిలవడానికి బీసీసీఐకి ఇంతకంటే మంచి మార్గం దొరకలేదేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక ఆ దేవుడే భారత క్రికెట్‌ను కాపాడాలి అంటూ ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ఇక గంగూలీ ట్వీట్‌పై టీమిండియా బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా స్పందించాడు. ఈ మేరకు..‘ నిజంగా?? అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు. భారత క్రికెట్‌లో ద్రవివడ్‌ కంటే మెరుగైన వ్యక్తి మీకు దొరకరు. అటువంటి లెజెండ్‌కు ఇలా నోటీసులు పంపి ఆయనను తీవ్రంగా అవమానించారు. క్రికెట్‌కు ఆయన లాంటి సేవలు ఎంతో అవసరం. అవును.. ఆ దేవుడే భారత క్రికెట్‌ను కాపాడాలి అంటూ భజ్జీ ట్వీట్‌ చేశాడు. కాగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై మాజీ క్రికెటర్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్‌...బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌. శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఫ్రాంచైజీ ఉంది. ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దీనిపై స్పందించాల్సిందిగా ఎథిక్స్‌ ఆఫీసర్‌ నుంచి ద్రవిడ్‌కు నోటీసు జారీ అయింది.

మరిన్ని వార్తలు