తాహిర్ తిప్పేశాడు

17 Jun, 2016 00:45 IST|Sakshi
తాహిర్ తిప్పేశాడు

7 వికె ట్లతో వెస్టిండీస్‌ను కూల్చేసిన ఇమ్రాన్
139 పరుగులతో దక్షిణాఫ్రికా ఘన విజయం

 
బెసెటెరి (సెయింట్ కీట్స్, నేవిస్):
బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా (99 బంతుల్లో 110: 13 ఫోర్లు) సెంచరీకి, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ తాహిర్ (7/45) బౌలింగ్ మెరుపులు తోడవడంతో ముక్కోణపు సిరీస్ ఆరో వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. వార్నర్ పార్క్‌లో బుధవారం జరిగిన  మ్యాచ్‌లో 139 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 343 పరుగుల భారీ స్కోరును సాధించింది. క్వింటన్ డికాక్(103 బంతుల్లో 71: 6 ఫోర్లు), డుప్లెసిస్ (50 బంతుల్లో 73 నాటౌట్: 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగగా... క్రిస్ మోరిస్ (26 బంతుల్లో 40: 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్ (19 బంతుల్లో 27: 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు.

వెస్టిండీస్ బౌలర్లలో కీరన్ పొలార్డ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 38 ఓవర్లలోనే 204 పరుగులు చేసి ఆలౌటైంది. చార్లెస్ (41 బంతుల్లో 49: 7 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్ కాగా శామ్యూల్స్ (24) ఫరవాలేదనిపించాడు. ఈ మ్యాచ్ 33వ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టిన తాహిర్...  వేగంగా 100 వికెట్లు (58వ మ్యాచ్‌లో) తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరఫున ఒక బౌలర్ వన్డేల్లో 7 వికెట్లు పడగొట్టడం కూడా ఇదే తొలిసారి. మరో బౌలర్ షమ్సీ 2 వికెట్లతో రాణించాడు.
 

>
మరిన్ని వార్తలు