చిత్తుగా ఓడినా.. 'కంగారు' అక్కర్లేదు!

15 Oct, 2016 21:47 IST|Sakshi
చిత్తుగా ఓడినా.. 'కంగారు' అక్కర్లేదు!

వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్ అయిన ఆస్ట్రేలియా జట్టుకు ఘోర పరాభవం ఎదురైనా ర్యాంకుల్లో మాత్రం వెనక్కి తగ్గలేదు. వన్డేల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా ఓ టీమ్ చేతిలో ఆసీస్ జట్టు 5-0 తేడాతో వైట్ వాష్ అయిన సందర్భమే లేదు. కానీ రెండు రోజుల కిందట దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన ఐదో వన్డేలోనూ ఆసీస్ పరాజయంపాలై వన్డేల్లో ఓ దారుణ సిరీస్ కు ముగింపు పలికింది. మరోవైపు సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ లోనూ ఆసీస్ జట్టును 31 పరుగుల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. దీంతో వన్డే చరిత్రలోనే ఆసీస్ పై 5-0తో సిరీస్ క్లీన్ స్విప్ చేసిన జట్టుగా సఫారీలు నిలిచారు.

తమ వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐదు వన్డేల సిరీస్ లో దారుణ ఓటమిని చవిచూసినా ఆసీస్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 118 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, తాజా సిరీస్ తో కొన్ని మెరుగుపరుచుకున్న దక్షిణాఫ్రికా జట్టు కేవలం రెండు పాయింట్ల(116) తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సఫారీలతో సిరీస్ ప్రారంభానికి ముందు ఆసీస్ 124 పాయింట్లతో ఏ జట్టుకు అందనంత ఎత్తులో ఎక్కువ పాయింట్లతో టాప్ ర్యాంకులో ఉండేది. కానీ సిరీస్ లో దారుణంగా ఓడినా.. పాయింట్ల అంతరం తగ్గిందే తప్పా.. ర్యాంకు మాత్రం తగ్గకపోవడం గమనార్హం. మరోవైపు న్యూజిలాండ్ 113 పాయింట్లతోనూ, టీమిండియా 110 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రేపటి నుంచి ప్రారంభమమ్యే సిరీస్ లో న్యూజిలాండ్ పై 4-1తో నెగ్గితేనే భారత్ మూడో ర్యాంకు సాధిస్తుంది.

మరిన్ని వార్తలు