ఎగేసికుంటూ పోయి.. ఉట్టి చేతులతోనే!

1 Jul, 2019 18:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఎప్పటిలాగే సన్నాహాలు చేసుకుని రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా తీవ్రంగా నిరాశపరిచింది. టోర్నీ హాట్ ఫేవరెట్స్ లో ఒకటైన టీం ఇలాగైనా ఆడేది అన్న అపప్రధను మూటగట్టుకుంది. ఎనిమిది మ్యాచ్‌లకు గాను రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి టోర్నీ నుంచి ముందుగానే నిష్క్రమించింది. వరల్డ్‌కప్‌లో సఫారీల ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పోరాడాలనే కసి లేకపోవడమే దక్షిణాఫ్రికా లీగ్‌ దశ నుంచే నిష్క్రమించడానికి ప్రధాన కారణంగా ఆ దేశ మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ విమర్శించాడు. అదే సమయంలో తమ జట్టు అత్యుత్తమ ఎలెవన్‌ను ఎంపిక చేయడంలో విఫలం కావడం కూడా ఘోర పరాభవానికి కారణమన్నాడు.

‘మా వాళ్లు వరల్డ్‌కప్‌కు బయల్దేరి ముందు వరకూ తుది కూర్పు ఎలా ఉండాలనే దానిపై ఒక అంచనా లేదు. అసలు ప్లాన్‌-బి అనేది మా మేనేజ్‌మెంట్‌ వద్ద లేనేలేదు. వరల్డ్‌కప్‌ సన్నాహకానికి సరిగా సిద్ధం కాలేదు. దాంతో మా జట్టుపై ఎవరికీ అంచనాలు లేవు. గత 12 నెలలుగా దక్షిణాఫ్రికా జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. అటు స్వదేశీ సిరీస్‌ల్లోనూ ఇటు విదేశీ పర్యటనల్లో కూడా దక్షిణాఫ్రికా విఫలమయ్యింది. ఆ నేపథ్యంలో వరల్డ్‌కప్‌కు ఉత్తమ ఎలెవన్‌ ఏంటనేది తెలుసుకోలేకపోయారు. వరల్డ్‌కప్‌కు బయల్దేరి ముందు వరకూ తుది జట్టుపై ఒక స్పష్టత లేదంటూ మా వాళ్లు ఎలా సిద్ధమయ్యారనేది అర్థం చేసుకోవచ్చు. కనీసం మూడు, నాలుగు స్థానాల్లో ఉంటుందని ఆశించిన సఫారీ అభిమానికి అది కాగితం వరకూ పరిమితమని మా వాళ్లు తేల్చి చెప్పారు.

డివిలియర్స్‌ వంటి స్టార్‌ ఆటగాడు లేకపోవడం కూడా మా జట్టు వైఫల్యంపై ప్రభావం చూపింది. చివరి నిమిషంలో అతను వస్తానన్న అప్పటికీ ఆలస్యమై పోయింది. అతనొక అసాధారణ ఆటగాడు. ఏబీకి నేను పెద్ద ఫ్యాన్‌. అతని అంతర్జాతీయ కెరీర్‌ అద్భుతంగా సాగింది. దాదాపు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి వస్తాననడం, అందులోనూ వరల్డ్‌కప్‌ ఆరంభమయ్యాక జట్టులోకి తీసుకోమంటూ దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్‌కు విన్నవించడం సరైనది కాదు. ఏది ఏమైనా మా వాళ్లు సరైన ప్రణాళిక లేకుండా మెగా టోర్నీకి సిద్ధం కావడం, లీగ్‌ దశలోనే ముగించడం చాలా బాధాకరం’ అని రోడ్స్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.


 

మరిన్ని వార్తలు