ఆ రెండు జట్లే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌: డుప్లెసిస్‌

31 Jan, 2019 13:18 IST|Sakshi

కేప్‌టౌన్‌: వచ్చే వన్డే వరల్డ్‌కప్‌కు పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగుతున్నామని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ తెలిపాడు. ఈ ఓవరాల్‌ మెగా టోర్నీలో భారీ అంచనాలు పెట్టుకుని పోరుకు సిద్ధమైన ప్రతీసారి తమకు నిరాశే మిగిలిందన్న విషయాన్ని డుప్లెసిస్‌ గుర్తు చేసుకున్నాడు. దాంతో తక్కువ అంచనాలతో మాత్రమే ఈసారి వరల్డ్‌కప్‌కు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. కాగా, రాబోవు వరల్డ్‌కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు టీమిండియా జట్లే ఫేవరెట్స్‌ అని డుప్లెసిస్‌ అభిప్రాయపడ్డాడు. ‘ ఇంగ్లండ్‌, భారత్ జట్లే వరల్డ్‌కప్‌ ఫేవరెట్స్‌. ప‍్రస్తుతం మా జట్టు యువ క్రికెటర్లతో ఉంది. వారంతా వరల్డ్‌కప్‌ ఆడాలనే ఆతృతతో ఉన్నారు. సాధ్యమైనంత వరకూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టాం. కచ్చితంగా వరల్డ్‌కప్‌ గెలవాలని మాత్రం ఇంగ్లండ్‌కు వెళ్లడం లేదు. గతంలో ఫేవరెట్స్‌గా వరల్డ్‌కప్‌కు సిద్దమైన ప్రతీ సందర్భంలో ప్రతికూల ఫలితాలే వచ‍్చాయి.

ఆయా సందర్భాల్లో మేము పేపర్‌పై చాలా పటిష్టమైన జట్టుగానే కనిపించాం. కాకపోతే ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. క్రికెట్‌ అనేది కాగితాల గేమ్‌ కాదు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ప్రస్తుత మాది బలమైన జట్టు ఎంతమాత్రం కాదు. అందుచేత  భారీ అంచనాలను పెట్టుకోలేదు’ అని డుప్లెసిస్‌ తెలిపాడు. గతంలో(1992,1999,2007,2015) నాలుగుసార్లు సఫారీలు సెమీ ఫైనల్‌ వరకూ వెళ్లినా వరల్డ్‌కప్‌ను గెలవలేకపోయారు.  దాంతో దక్షిణాఫ్రికాపై చోకర్స్‌ ముద్రపడింది.

మరిన్ని వార్తలు