పేకమేడలా కూలిన ఆసీస్

12 Nov, 2016 13:26 IST|Sakshi
పేకమేడలా కూలిన ఆసీస్

హోబార్ట్:మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ శనివారం ఆరంభమైన రెండో టెస్టులో ఆసీస్ పేకమేడలా కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా తొలి రోజు ఆటలో కనీసం మూడంకెల స్కోరును దాటకుండానే చేతులెత్తేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ను సఫారీలు చావు దెబ్బతీశారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1), బర్న్స్(1)లు ఆదిలోనే ఘోరంగా విఫలం కాగా, ఆ తరువాత ఉస్మాన్ ఖవాజా(4) మూడో వికెట్ గా అవుటయ్యాడు.

 

ఒకవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్(48 నాటౌట్;80 బంతుల్లో 5 ఫోర్లు) సఫారీ బౌలర్లను నిలువరించే యత్నం చేసినా, మిగతా ఆటగాళ్లు వరుస పెట్టి క్యూట్టారు. దాంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 85 పరుగులకు ఆలౌటైంది.ఆసీస్ ఆటగాళ్లలో తొమ్మిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం ఆ జట్టును తీవ్రంగా నిరాశపరిచింది. దక్షిణాఫ్రికాపై ఆసీస్ కు ఇదే అత్యల్ప స్కోరు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్ ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా, అబాట్ మూడు వికెట్లు సాధించాడు.రబడాకు ఒక వికెట్ దక్కింది.

ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.స్టెఫెన్ కుక్(23),ఎల్గర్(17),హాషీమ్ ఆమ్లా(47), డుమినీ(1), డుప్లెసిస్(7)లు పెవిలియన్ చేరారు. బావుమా(38 బ్యాటింగ్), డీ కాక్(28 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా తొలి టెస్టులో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు