నిలబడి..నిలబెట్టాడు..!

15 Jan, 2018 16:04 IST|Sakshi

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సోమవారం మూడో రోజు ఆటలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకుని సత్తాచాటాడు. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన కోహ్లి.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒకవైపు వికెట‍్లు పడుతున్న కోహ్లి మాత్రం అత్యంత నిలకడను ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే తన టెస్టు కెరీర్‌లో 21వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.


183/5 ఓవర్‌ నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాకు మ్యాచ్‌ ఆరంభమైన కొద్ది నిమిషాల వ్యవధిలోనే షాక్‌ తగిలింది. హార్దిక్‌ పాండ్యా తన స్వీయ తప్పిదంతో రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో భారత జట్టు 209 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో కోహ్లికి జత కలిసిన అశ్విన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిసి 71 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జత చేశాడు. అయితే జట్టు 280 పరుగుల వద్ద ఉండగా అశ్విన్‌(38;54 బంతుల్లో 7 ఫోర్లు) ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. ఆపై పరుగు వ్యవధిలో మొహ్మద్‌ షమీ(1)కూడా అవుటయ్యాడు. మూడో రోజు లంచ్‌ సమయానికి భారత జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది.  ఇంకా భారత జట్టు 48 పరుగుల వెనుకబడి ఉంది. కోహ్లి(141 బ్యాటింగ్‌)కి జతగా ఇషాంత్‌ శర్మ(0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. కోహ్లి నిలబడటంతో దక్షిణాఫ్రికాకు దాదాపు సమంగా నిలిచింది టీమిండియా. భారత్‌ సాధించిన ప్రస్తుత పరుగుల్లో సుమారు సగం పరుగులు కోహ్లి సాధించినవే కావడం విశేషం.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు