సమరానికి ‘సఫారీ’ సిద్ధం!

20 May, 2019 04:23 IST|Sakshi

ప్రపంచకప్‌ టైటిల్‌ వేటకు దక్షిణాఫ్రికా

ప్రతిభ ఉన్నా అందని కిరీటం

ఈసారి కూడా భారీ అంచనాలతో బరిలోకి 

అదృష్టానికి, దురదృష్టానికి మధ్య అంతరంఎంత ఉంటుందో దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టును అడిగితే తెలుస్తుంది.  మైదానంలో వాన నీళ్లకి, కన్నీళ్లకి మధ్య పెద్దగాతేడా ఉండదని వారికి మాత్రమే తెలిసిన విషాదం.ప్రతీసారి గంపెడుఆశలతో బరిలోకి దిగడం, ఆ తర్వాత గుండె పగిలేలా రోదించడం సఫారీ ఆటగాళ్లందరికీఅనుభవమే.ఒకటా, రెండా ఎన్ని సార్లు ‘ప్రొటీస్‌’ బాధ ప్రపంచంబాధగా మారిపోయింది. 

ఏడు ప్రపంచ కప్‌లలో బరిలోకి దిగి ఒక్కసారిమినహా ప్రతీ సారి లీగ్‌ దశను దాటగలిగినాదక్షిణాఫ్రికాకు వరల్డ్‌ కప్‌ విజయం మాత్రంసుదూర స్వప్నంగానే మిగిలిపోయింది.  అత్యుత్తమ జట్లలో ఒకటిగా అంచనాలతో బరిలోకిదిగడం, ఆ తర్వాత ఒక అనూహ్య క్షణాన నిష్క్రమించడం ఆ జట్టుగా అలవాటుగా మారిపోయింది.  ఎందరో దిగ్గజాలు కప్‌ కల నెరవేరకుండానే ఆటకు గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమైన సఫారీ టీమ్‌ ఏ మేరకురాణిస్తుందనే ఆసక్తికరం.  

బలాలు...
►వన్డే ఫార్మాట్‌కు తగిన ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది. గత రెండు ప్రపంచ కప్‌లలో ఆడిన అనుభవం ఉన్న క్రికెటర్లతో పాటు ఇటీవల నిలకడగా రాణిస్తున్న యువ ప్లేయర్లు కూడా జట్టులో ఉన్నారు.  

►ఓపెనర్‌గా ఒకవైపు డి కాక్‌ దూకుడుగా ఆడగల సత్తా ఉంటే, మరో ఎండ్‌లో హషీం ఆమ్లా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేయగలడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను డు ప్లెసిస్‌ సమర్థవంతంగా నడిపించగలడు. మిడిలార్డర్‌లో డుమిని అనుభవం కూడా జట్టుకు పనికొస్తుంది. విధ్వంసక ఆటగాడు మిల్లర్‌ చివర్లో చెలరేగిపోగల సమర్థుడు.  

►మోరిస్, ఫెలుక్‌వాయో, ప్రిటోరియస్‌ రూపంలో సమర్థులైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. స్టెయిన్, రబడ, ఇన్‌గిడివంటి సూపర్‌ ఫాస్ట్‌ బౌలర్లతో పాటు వయసు పెరిగిన కొద్దీ విలువ పెంచుకుంటున్న తాహిర్‌లాంటి  స్పిన్నర్‌తో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.  

►ఐపీఎల్‌లో టాప్‌–2 బౌలర్లుగా నిలిచిన తాహిర్, రబడ జోరు మీదున్నారు. ఈ బృందానికి ప్రపంచంలో ఏ జట్టునైనా చిత్తు చేసే సామర్థ్యం ఉంది.  

►డు ప్లెసిస్‌ నాయకత్వం కూడా కీలక సమయాల్లో సఫారీకి అదనపు బలం కాగలదు. గత ఏడాది కాలంలో సొంతగడ్డపై ఆడిన 13 వన్డేల్లో 11 గెలిచింది. పైగా ఆస్ట్రేలియా గడ్డపై 2–1తో సిరీస్‌ నెగ్గింది. 

బలహీనతలు

►జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ఆమ్లా ఫామ్‌ ఆ జట్టును ప్రధానంగా ఆందోళన పరుస్తున్న అంశం. ఒక దశలో పరుగుల ప్రవాహంలో కోహ్లితో పోటీ పడినా... ఇటీవలి ప్రదర్శన చాలా ఘోరంగా ఉంది. గత రెండేళ్లలో అతను వన్డేల్లో ఒకే ఒక సెంచరీ చేశాడు. ఫామ్‌ కోసం తంటాలు పడుతూ దేశవాళీ టి20ల్లో ఆడిన అతను 8 మ్యాచ్‌లలో ఒకే సారి 20కి పైగా పరుగులు చేశాడు. ఆమ్లా కీలక సమయంలో ఫామ్‌లోకి రాకుంటే దక్షిణాఫ్రికాకు సమస్యలే.  

►ప్రత్యామ్యాయ ఓపెనర్‌గా మర్క్‌రమ్‌ ఉన్నా అతనికి పెద్దగా అనుభవం లేదు. డుమిని జాతీయ జట్టు తరఫున చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడి చాలా కాలమైంది.  

►అయితే ప్రదర్శనకంటే కూడా ఆటగాళ్ల గాయాలు సఫారీని ఆందోళన పరుస్తున్నాయి. ప్రధాన పేసర్‌ రబడ వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతుండగా... వెటరన్‌ స్టెయిన్‌ భుజం గాయం తిరగబెట్టింది. ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లకే పరిమితమై అతను స్వదేశం చేరాడు. పైగా వరుస గాయాల తర్వాత వన్డేల్లో స్టెయిన్‌ ప్రభావం అంతంత మాత్రంగానే మారింది.  

►మరోవైపు 18 వన్డేలే ఆడిన ఇన్‌గిడి తన తొలి ప్రపంచ కప్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. తాహిర్‌పై జట్టు ఎంతో నమ్మకముంచగా... రెండో స్పిన్నర్‌గా ఉన్న షమ్సీకి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. మెగా టోర్నీకి ముందు అనూహ్యంగా డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించడం కూడా ఆ జట్టును కొంత బలహీనంగా మార్చింది.  

గత రికార్డు

►నిషేధం ముగిసిన అనంతరం 1992 నుంచి  దక్షిణాఫ్రికా అన్ని ప్రపంచ కప్‌ టోర్నీలు (మొత్తం 7) ఆడింది. ఒక్కసారి కూడా ఫైనల్‌ వరకు వెళ్లలేకపోయింది.  

►1992, 1999, 2007, 2015లలో సెమీఫైనల్‌ చేరింది. 1996, 2011లలో కూడా నాకౌట్‌ దశకు (క్వార్టర్‌ ఫైనల్‌) చేరింది. –ఒక్క 2003లో సొంతగడ్డపైనే జరిగిన టోర్నీలో అనూహ్యంగా విఫలమై గ్రూప్‌ దశకే పరిమితమైంది.  

►న్యూజిలాండ్‌తో జరిగిన 2015 ప్రపంచ కప్‌ సెమీఫైనల్లో చివరి 2 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన స్థితిలో స్టెయిన్‌ బౌలింగ్‌లో ఇలియట్‌ సిక్సర్‌ బాదడంతో సఫారీ జట్టు కన్నీళ్లపర్యంతమైంది.

సూపర్‌మ్యాన్‌ ఆలోచనలు లేవు
గత ప్రపంచ కప్‌లలో మా జట్టు ప్రత్యేకంగా ఉండాలని భావించాం. ఎప్పుడు ఆడే తరహాలో కాకుండా ఏదైనా ప్రత్యేకంగా కనిపించాలని పదే పదే ప్రయత్నించాం. ఒక ఆటగాడు 50 బంతుల్లో సెంచరీ చేయడంవల్లో, ఒకరు 20 పరుగులకు 7 వికెట్లు తీయడంవల్లో వరల్డ్‌ కప్‌ గెలవలేం. ఎంత అవసరమో అది మాత్రం చేయకుండా వేరేవాటిపై దృష్టి పెట్టాం. గతంలోలాగా సూపర్‌మ్యాన్‌ తరహా పనులు చేయదల్చుకోలేదు. ఫలితంగా ప్రపంచకప్‌లలో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాం. సరిగ్గా చెప్పాలంటే అవసరానికి మించి మాపై ఒత్తిడి పెంచుకున్నాం.  ఈసారి అలాంటిది జరగనివ్వం. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడి క్రికెట్‌ను ఆస్వాదించే ప్రయత్నం చేస్తాం. గత కొంత కాలంగా మానసికంగా దృఢంగా ఉండే అంశంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం.    

–దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌

జట్టు వివరాలు
ఫాఫ్‌ డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), హషీం ఆమ్లా, క్వింటన్‌ డి కాక్, జేపీ డుమిని, ఇమ్రాన్‌ తాహిర్, ఎయిడెన్‌ మర్క్‌రమ్, డేవిడ్‌ మిల్లర్, క్రిస్‌ మోరిస్, లుంగి ఇన్‌గిడి, ఫెలుక్‌వాయో, డ్వెయిన్‌ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్‌ షమ్సీ, డేల్‌ స్టెయిన్, వాన్‌ డర్‌ డసెన్‌.  

>
మరిన్ని వార్తలు