‘తీసేయలేదు.. మా ప్రణాళికల్లో ఉన్నాడు’

22 Jan, 2020 14:52 IST|Sakshi

జోహెన్నస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా టీ20, టెస్టు సారథి డుప్లెసిస్‌కు ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఇంటా బయటా అపజయాలు, సారథిగా ఆటగాడిగా తరుచూ విఫలమవుతుండటంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, గతంలో వన్డే సారథ్య పగ్గాల నుంచి డుప్లెసిస్‌ను తప్పించగా.. తాజాగా అతడిని ఏకంగా వన్డే జట్టు నుంచే దక్షిణాఫ్రికా సెలక్టర్లు తొలగించారు. దీంతో డుప్లెసిస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నాడని అనేక వార్తల వచ్చాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జోండి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో కొన్ని ప్రయోగాలకు పూనుకున్నామని తెలిపాడు. 

డుప్లెసిస్‌కు దక్షిణాఫ్రికా వన్డే ద్వారాలు మూసుకపోలేదని, త్వరలో జట్టులోకి వస్తాడని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాకు సంబంధించి భవిష్యత్‌ ప్రణాళికల్లో డుప్లెసిస్‌ ఉన్నాడని తెలిపాడు. అయితే ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ప్రయోగాత్మకంగానే డుప్లెసిస్‌ స్థానంలో కొత్తవాళ్లను ఎంపిక చేసినట్లు ప్రకటించాడు. ఇక వన్డే ప్రపంచకప్‌ ముందు కీలక బౌలర్లు గాయాల బారిన పడ్డారని.. ఈ ఏడాది కీలక టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో సీనియర్‌ ఆటగాళ్లపై వర్క్‌లోడ్‌ పడకూడదనే ఉద్దేశంతో కగిసో రబడాను ఎంపిక చేయలేదన్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టులో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని లిండా కోండి పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా కోల్పోయిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు