ఓటమి దిశగా దక్షిణాఫ్రికా

23 Jul, 2018 03:59 IST|Sakshi
అఖిల ధనంజయ

లక్ష్యం 490; ప్రస్తుతం 139/5

శ్రీలంకతో రెండో టెస్టు

కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఆటతీరులో ఎలాంటి మార్పులేదు. లంక స్పిన్నర్ల ధాటికి తొలి టెస్టులో ఘోర పరాజయం పాలైన సఫారీ జట్టు రెండో టెస్టులోనూ ఓటమి దిశగా పయనిస్తోంది. 490 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆ జట్టు ఆదివారం ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. డి బ్రుయెన్‌ (97 బంతుల్లో 45 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), ఎల్గర్‌ (37) ఫర్వాలేదనిపించారు.

మార్క్‌రమ్‌ (14), ఆమ్లా (6), డు ప్లెసిస్‌ (7) విఫలమయ్యారు. లంక బౌలర్లలో అఖిల ధనంజయ, హెరాత్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు చేతిలో ఉన్న సఫారీ జట్టు విజయానికి ఇంకా 351 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 151/3తో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక 81 ఓవర్లలో 275/5 వద్ద రెండో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. మ్యాథ్యూస్‌ (71; 7 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.

మరోవైపు ఇటీవల తరచుగా జట్టు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు బ్యాట్స్‌మన్‌ ధనుష్క గుణ తిలకపై లంక క్రికెట్‌బోర్డు మూడు ఫార్మాట్‌లలో కూడా పాల్గొనకుండా నిషేధం విధించింది.

మరిన్ని వార్తలు