విరిసిన గులాబీ.. సౌతాఫ్రికా థ్రిల్లింగ్‌ విక్టరీ

11 Feb, 2018 02:17 IST|Sakshi

‘పింక్‌’ పోరులో భారత జోరు తేలిపోయింది. గులాబీ ముల్లు గుచ్చేసింది. దక్షిణాఫ్రికా తనదైన శైలిలో గెలిచింది. నాలుగో వన్డేలో ధావన్‌ సెంచరీ చేసినా... కోహ్లి కసిదీరా ఆడినా... గులాబీ జెర్సీలో మమ్మల్ని ఓడించలేరని సఫారీ తేలిగ్గా తేల్చేసింది. మొత్తానికి భారత జైత్రయాత్రను వాండరర్స్‌లో మొదట వర్షం అడ్డుకుంటే... తర్వాత ప్రత్యర్థి జట్టు ఓడించేదాకా ఆడుకుంది. 

జొహన్నెస్‌బర్గ్‌: భారత్‌ భారీ స్కోరు నిలవలేదు. పేస్‌ పదును సరిపోలేదు. స్పిన్‌ పాచిక పారలేదు. కొత్త చరిత్ర సృష్టించేందుకు వాన, వాండరర్స్‌ మైదానం రెండూ సహకరించలేదు. నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ‘పింక్‌’స్థైర్యమే గెలిచింది. టీమిండియా ‘హ్యాట్రిక్‌’ విజయాలకు బ్రేకులేసింది. శనివారం ఆగి... ఆగి... సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (105 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కోహ్లి (83 బంతుల్లో 75; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. రబడ, ఇన్‌గిడి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 28 ఓవర్లలో 202 పరుగులుగా నిర్ణయించగా... ఆ జట్టు 25.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసి గెలిచింది. సిరీస్‌లో ఐదో వన్డే మంగళవారం పోర్ట్‌ ఎలిజబెత్‌లో జరుగుతుంది. ఆరు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 3–1తో ఆధిక్యంలో ఉంది.

మిల్లర్‌, క్లాసెన్‌ వీరబాదుడు : ఓపెనర్లు మార్క్‌రమ్‌ (22), ఆమ్లా(33), ఫస్ట్‌డౌన్‌ డుమిని(10) తక్కువ పరుగులకే ఔటయ్యారు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన విధ్వంసకారుడు ఏబీ డివిల్లీర్స్‌.. అందరూ ఊహించినట్లే చెలరేగి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ 26 పరుగులకే(18 బంతుల్లో) పెవిలియన్‌ బాటపట్టాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన మిల్లర్‌, క్లాసెన్‌లు ఆకాశమే హద్దుగా విజృంభించారు. చాహల్‌ బౌలింగ్‌లో లైఫ్‌లు పొందిన మిల్లర్‌ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సఫారీకి గెలుపుబాట వేశాడు. జట్టుస్కోరు 174 ఉన్నప్పుడు మిల్లర్‌..5వ వికెట్‌గా ఔటయ్యాడు. అటుపై ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ క్లాసెన్‌ (27 బంతుల్లో 43 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కడదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఫెలుక్‌వాయో (5 బంతుల్లో 23 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారత ఫీల్డింగ్‌ వైఫల్యాలు, కీలకమైన క్యాచ్‌ల నేలపాలు సఫారీకి కలిసొచ్చాయి. భారత బౌలర్లలో కుల్దీప్‌ 2 వికెట్లు పగడొట్టాడు. చాహల్‌, బూమ్రా, పాండ్యాలకు తలో వికెట్‌ దక్కింది.

ధావన్‌ ధనాధన్‌ : శనివారం జరిగిన నాలుగో వన్డేలో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (105 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించగా, కోహ్లి (83 బంతుల్లో 75; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. టాస్‌ నెగ్గిన భారత్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగగా... రోహిత్‌ శర్మ (5) మరోసారి విఫలమయ్యాడు. రబడ బౌలింగ్‌లో అతనికే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో భారత్‌ 20 పరుగులకే మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఇక మరో వికెట్‌ కోసం దక్షిణాఫ్రికా చెమటోడ్చింది. క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లి, ధావన్‌తో కలిసి స్కోరు బోర్డును ధాటిగా పరిగెత్తించాడు. దీంతో జట్టు స్కోరు 19వ ఓవర్లో వంద పరుగులు చేరింది. తర్వాత కూడా ఓవర్‌కు సగటున 6 రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ఈ జోడీని విడగొట్టేందుకు సఫారీ బౌలర్ల ప్రయత్నాలేవీ ఫలించలేదు. మొదట ధావన్‌ ఆ తర్వాత కోహ్లి (56 బంతుల్లో; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారత్‌ స్కోరు 25 ఓవర్లలో 150కి చేరింది. ఎట్టకేలకు జట్టు స్కోరు 178 పరుగుల వద్ద మోరిస్‌ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి కోహ్లి నిష్క్రమించడంతో 158 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కోహ్లి ఔటయ్యే సమయానికి స్కోరు 31.1 ఓవర్లలో 178/2. చేతిలో మరో 8 వికెట్లుండటంతో 340 పరుగుల భారీ స్కోరు ఖాయమనుకుంటే కనీసం మూడొందలైనా చేయలేకపోయింది. రహానే, శ్రేయస్‌ అయ్యర్, పాండ్యా అంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. వరుస ఓవర్లలో ధావన్, రహానే (8) నిష్క్రమించడం భారత్‌ను దెబ్బ తీసింది. దీంతో శ్రేయస్‌ (18), ధోని (42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఆచితూచి ఆడటంతో స్కోరు వేగం పూర్తిగా మందగించింది. చివర్లో భారీషాట్ల కోసం ప్రయత్నించినప్పటికీ దక్షిణాఫ్రికా బౌలర్ల చేతికి చిక్కారు. పాండ్యా (9) కొట్టిన షాట్‌ను మార్క్‌రమ్‌ లిప్తపాటు కాలంలోనే గాల్లో అందుకున్న తీరు అద్భుతం.

‘పింక్‌’ వాండరర్స్‌
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పింక్‌ జెర్సీలతో మైదానంలోకి దిగారు. దీనికి మద్దతుగా ప్రేక్షకులు సైతం గులాబీ రంగు టీషర్టులు, టోపీలు, కళ్ల జోడులతో స్టేడియాన్ని పింక్‌ మయం చేశారు. ఆశ్చర్యకరంగా స్టేడియంలోని ప్రకటనలు కూడా గులాబీ వర్ణంలోనే దర్శనమిచ్చాయి. నేటి మ్యాచ్‌తో కలిపి మొత్తం 6 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా పింక్‌ జెర్సీలతో ఆడగా.. అన్నింటా విజయం సాధించింది.

మరిన్ని వార్తలు