దక్షిణాఫ్రికాకు దెబ్బ మీద దెబ్బ

3 Jun, 2019 11:29 IST|Sakshi

లండన్‌ : వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దక్షిణాఫ్రికాకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌, బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మరుసటి మ్యాచ్‌ను చేజార్చుకున్న సఫారీలు.. బుధవారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనైనా నెగ్గి శుభారంభం చేయాలని భావించారు. అయితే ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి గాయంతో ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లుంగి ఎంగిడి తొడకండరాలు పట్టేయడంతో అర్ధాంతరంగా మైదానాన్ని వీడాడు. కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన లుంగి ఎంగిడి 38 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్‌తో జరిగే మ్యాచ్‌కు లుంగి ఎంగిడి అందుబాటులో ఉండటం లేదని దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్‌ మహ్మద్‌ మూసాజీ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు ఎంగిడి అందుబాటులోకి వస్తాడని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతానికి అతని గాయం తీవ్రత తెలియదు. రేపు పరీక్షలు జరుపుతాం. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచిస్తాం’ అని ఐసీసీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు కీలక ఆటగాళ్లు సైతం గాయాలతో సతమతమవుతుండటం.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. కెప్టెన్‌ డూప్లెసిస్‌, స్టార్‌ బౌలర్‌ స్టెయిన్‌, బ్యాట్స్‌మెన్‌ ఆమ్లాలు గాయాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. 80 శాతం మాత్రమే ఫిట్‌గా ఉన్న స్టెయిన్‌, తొలి మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్‌ బౌన్సర్‌కు గాయపడ్డ ఆమ్ల భారత్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తారని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌తో పరాజయం పొందడం సఫారి జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ క్రమంలో నెం 2 ర్యాంకర్‌ అయిన కోహ్లిసేనను ఏ మేరకు ఎదుర్కోగలదో చూడాలి. 

మరిన్ని వార్తలు