శ్రీలంకలో దక్షిణాఫ్రికా పర్యటన వాయిదా

21 Apr, 2020 05:15 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: శ్రీలంకలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం ఈ జూన్‌లో ఇరు దేశాల మధ్య మూడేసి వన్డేలు, టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ అదుపులోకి రాకపోగా... రోజురోజుకీ మహమ్మారి ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో సింహళ దేశంలో క్రికెట్‌ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో మా ఆటగాళ్లు సిరీస్‌కు సన్నద్ధంగా లేరు.

పైగా అన్నింటికి మించి ఆటగాళ్ల ఆరోగ్యం ప్రధానమైంది. వాయిదా వేయాలనే నిర్ణయం భారమైనా... తప్పలేదు. మళ్లీ క్రికెట్‌ మొదలయ్యాక భవిష్యత్‌ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ)లోని వెసులుబాటును బట్టి ఈ ద్వైపాక్షిక సిరీస్‌ను రీషెడ్యూల్‌ చేసుకుంటాం’ అని క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జాక్వెస్‌ ఫాల్‌ తెలిపారు. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ను వాయిదా వేయడం వల్ల తమ జట్టు టి20 ప్రపంచకప్‌ సన్నాహకానికి ఎదురుదెబ్బని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్‌ అక్టోబర్‌–నవంబర్‌లలో జరుగనుంది.

మరిన్ని వార్తలు