కుక్, ఆమ్లా సెంచరీలు

23 Jan, 2016 04:25 IST|Sakshi
కుక్, ఆమ్లా సెంచరీలు

* దక్షిణాఫ్రికా 329/5
* ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు

సెంచూరియన్: ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన నాలుగో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. తొలి మ్యాచ్ ఆడుతున్న స్టీఫెన్ క్రెయిగ్ కుక్ (115; 14 ఫోర్లు), హషీం ఆమ్లా (109; 19 ఫోర్లు) సెంచరీలతో చెలరేగారు. కుక్, ఆమ్లా రెండో వికెట్‌కు 202 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే 36 పరుగుల వ్యవధిలో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. బవుమా (32 బ్యాటింగ్), డి కాక్ (25 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
 
సెంచరీల ‘సెంచరీ’...
సెంచూరియన్ టెస్టులో ఆసక్తికర రికార్డు నమోదైంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెరీర్ తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 100వ ఆటగాడిగా కుక్ నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడు అతను. స్టీఫెన్ తండ్రి జేమ్స్ కుక్ 1992లో తన తొలి టెస్టులో మ్యాచ్ తొలి బంతికే డకౌట్ కాగా... దాదాపు పాతికేళ్ల తర్వాత అతని కొడుకు తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం మరో విశేషం.

మరిన్ని వార్తలు