ఉత్కం‘టై’న మ్యాచ్‌లో సఫారీ ‘సూపర్‌’ విక్టరీ 

21 Mar, 2019 00:09 IST|Sakshi

కేప్‌టౌన్‌: క్రికెట్‌ చిత్రమంటే ఇదేనేమో! చివరి బంతికి 2 పరుగులు చేయలేని తాహిర్‌... సూపర్‌ ఓవర్‌లో అదనంగా బంతులేసినా (2 వైడ్లు) లంకను అద్భుతంగా కట్టడి చేసి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక, తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 134 పరుగులే చేశాయి. ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన ఈ పొట్టి మ్యాచ్‌ ‘టై’ అయింది. దీంతో మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ తేల్చింది. దక్షిణాఫ్రికాను విజేతగా నిలిపింది. ముందుగా శ్రీలంక పేసర్‌ మలింగ వేసిన ఈ సూపర్‌ ఓవర్లో మిల్లర్‌ సిక్స్, ఫోర్‌తో సఫారీ జట్టు మొత్తం 14 పరుగులు చేసింది. లంక గెలవాలంటే 15 పరుగులు చేయాలి. అయితే తాహిర్‌ వేసిన ఓవర్లో పెరీరా, ఫెర్నాండో విఫలమయ్యారు.

వైడ్‌ల రూపంలో 2 పరుగులొచ్చినా... 8 బంతులు ఎదుర్కొన్నా... లంక 3 పరుగులే చేసింది. మొత్తం 5 పరుగులకు మించి చేయలేకపోయింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ తొలి టి20లో మొదట శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. కమిండు మెండిస్‌ (41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశాడు. తర్వాత దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 134 పరుగులే చేసింది. మిల్లర్‌ (41; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మలింగ 2 వికెట్లు తీశాడు. రేపు రెండో టి20 జరుగుతుంది. 

మరిన్ని వార్తలు