ప్రాక్టీస్‌ కుదరలేదు

27 May, 2019 04:22 IST|Sakshi

వార్మప్‌ మ్యాచ్‌లకు వాన దెబ్బ రెండు మ్యాచ్‌లు రద్దు

బ్రిస్టల్‌: ప్రాక్టీస్‌ను వానచినుకులు అడ్డుకున్నాయి. దీంతో ఆదివారం జరగాల్సిన రెండు ప్రపంచకప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య వార్మప్‌ మ్యాచ్‌ 12.4 ఓవర్ల వరకు సాగింది. కానీ బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ జట్ల మధ్య ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. కనీసం టాస్‌ కూడా పడలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

దీంతో ఆమ్లా, డికాక్‌ సఫారీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లకు వికెట్‌ చిక్కకుండా బ్యాటింగ్‌ చేశారు. ఆమ్లా (46 బంతుల్లో 51 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, డికాక్‌ (30 బంతుల్లో 37 నాటౌట్‌; 7 ఫోర్లు) ధాటిగా ఆడాడు. 12.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా వికెట్‌ కోల్పోకుండా 95 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మైదానాన్ని ముంచెత్తింది. ఔట్‌ ఫీల్డ్‌ అంతా చిత్తడిగా మారడంతో మళ్లీ ఆట కొనసాగలేదు.   

మరిన్ని వార్తలు