సఫారీ భారీ విజయం 

29 Feb, 2020 03:35 IST|Sakshi

చితక్కొట్టిన లిజెల్లీ లీ

మహిళల టి20 ప్రపంచ కప్‌

కాన్‌బెర్రా: మహిళల టి20 ప్రపంచకప్‌లో థాయ్‌లాండ్‌ కూనపై దక్షిణాఫ్రికా 113 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. సఫారీ ఓపెనర్‌ లిజెల్లీ లీ (60 బంతుల్లో 101; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. ఆమె సెంచరీలో 82 పరుగులు ఫోర్లు, సిక్సర్లతోనే వచ్చాయి. మొదట దక్షిణాఫ్రికా అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. సున్‌ లూస్‌ (41 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. లీ, లూస్‌ రెండో వికెట్‌కు 13 ఓవర్లలో 131 పరుగులు జోడించారు.  కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన థాయ్‌లాండ్‌ కూన 19.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. కంచోంఫు (26), సుతిరంగ్‌ (13)లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. షబ్నిమ్, లూస్‌ చెరో 3 వికెట్లు తీశారు.

పాక్‌పై ఇంగ్లండ్‌ జయభేరి 
మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ మహిళలు 42 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ అమ్మాయిలపై గెలిచారు. ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. హీథెర్‌ నైట్‌ (62), సీవెర్‌ (36) ధాటిగా ఆడారు. ఐమన్‌కు 3 వికెట్లు దక్కాయి. లక్ష్యఛేదనకు దిగిన పాక్‌ 19.4 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. అలియా (41) ఒంటరి పోరాటం చేసింది. ష్రబ్‌సోల్, గ్లెన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని వార్తలు